Share News

స్థానిక ఎన్నికలకు సమాయత్తం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:02 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం
కలెక్టరేట్‌లో సోమవారం బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు టెండర్లు నిర్వహిస్తున్న జేసీ టి.శ్రీపూజ

ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల ఖరారు

జిల్లాకు చేరుకున్న ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు

పంచాయతీలు, జడ్పీ, ఎంపీటీసీ స్థానాల బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ టెండర్లు పూర్తి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఎన్నికల సామగ్రి సైతం జిల్లా కేంద్రానికి చేరింది. బ్యాలెట్‌ బాక్స్‌లను మండలాల వారీగా సిద్ధం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పంచాయతీలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు సంబంధించిన టెండర్లను ఖరారు చేశారు. ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడమే తరువాయి అన్నట్లు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనలతో ఎన్నికల సిబ్బందిని సైతం సిద్ధం చేసి, పీవో, ఏపీవో, ఓపీవో బాధ్యతలను సైతం అప్పగించే పనులను ఆన్‌లైన్‌లోనే చేశారు. ఎన్నికల షెడ్యూల్డ్‌ విడుదలైతే, తక్షణమే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు టెండర్లు పూర్తి

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాల ముద్రణ టెండర్లు సైతం సోమవారం పూర్తి చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ ఆధ్వర్యంలో జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పంచాయతీలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణపై టెండర్లు నిర్వహించారు. దీనిలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఒక ముద్రణా సంస్థ జడ్పీ, మండల పరిషత్‌లకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలు, మరో ముద్రణా సంస్థ పంచాయతీలకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాల ముద్రణ చేసేందుకు టెండర్లను దక్కించుకున్నాయి. నిబంధనల మేరకు బ్యాలెట్‌ పత్రాల ముద్రణ చేపట్టాలని జేసీ శ్రీపూజ టెండర్లదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ డీఎల్‌డీవో జయప్రకాశ్‌, సిబ్బంది రంగారావు, సుందరరావు, తదితరులు పాల్గొన్నారు.

బిజీ బిజీగా అధికారులు, రాజకీయ పార్టీలు

ఇప్పటికే మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఏ క్షణంలో నోటిఫికేషన్‌ వచ్చినా పనులు చకాచకా చేపట్టాలనే లక్ష్యంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు చేపట్టాల్సిన చర్యలను కొనసాగిస్తున్నారు. దీంతో పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. అలాగే అదే స్థాయిలో రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల హడావిడిలోనే ఉన్నాయి. మండల స్థాయిలో జడ్పీటీసీ సభ్యుల ఎంపిక, గ్రామ స్థాయిలో ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీలకు సర ్పంచ్‌ అభ్యర్థుల ఎంపికలకు కసరత్తు చేస్తున్నారు. అధికార, విపక్ష, స్వతంత్ర పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికలో చాలా బిజీగా ఉన్నాయి.

జిల్లాలోని స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు

పదకొండు మండలాలు: పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు

గ్రామ పంచాయతీలు: 244, వార్డులు: 2,446, పోలింగ్‌ కేంద్రాలు: 2.446

జడ్పీటీసీ స్థానాలు: 11, ఎంపీటీసీ స్థానాలు: 172, పోలింగ్‌ కేంద్రాలు: 616

అసెంబ్లీ నియోజకవర్గాలు: పాడేరు, అరకులోయ

మొత్తం ఓటర్లు: 4,98,467

ఎస్‌టీ ఓటర్లు: 4,69,033

ఎస్‌సీ ఓటర్లు: 28,78

బీసీ ఓటర్లు: 21,168

ఇతర ఓటర్లు: 5,388

Updated Date - Oct 13 , 2026 | 12:02 AM