స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:45 PM
స్థానిక ఎన్నికలకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
పాడేరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధంపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆయా అధికారులు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని, పంచాయతీలు, వార్డులు, గ్రామాలు, ఇతర సమాచారాన్ని ఎప్పకప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో కనిపించే లోటుపాట్లను తక్షణమే పరిష్కరించుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో సైతం పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్ కుమార్, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
సెల్ నెట్‌వర్క్, రోడ్డు పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో సెల్ నెట్‌వర్క్ పనులు, రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలోని మారుమూల పల్లెల్లో రోడ్డు, సెల్ నెట్‌వర్క్‌పై ఐటీడీఏ, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంజనీరింగ్, అటవీ శాఖలకు చెందిన అధికారులతో ఆమె బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ నెట్‌వర్క్ కనెక్టవిటీని పెంచాలని, అందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే రోడ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ప్రధానంగా జీకేవీధి మండలంలోని రోడ్ల నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ కనబరచాలని తెలిపారు. సెల్ నెట్‌వర్క్, రోడ్ల నిర్మాణాలపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.