Share News

స్థానిక ఎన్నికలకు సమాయత్తం

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:03 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం
పాడేరు వచ్చిన ఎన్నికల సామగ్రి

ఇప్పటికే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఇతర ఓటర్ల జాబితాలు సిద్ధం

పోలింగ్‌ కేంద్రాలు ఖరారు

జిల్లాకు చేరిన ఎన్నికల సామగ్రి

ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం రాజకీయ పార్టీల ఎదురుచూపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఎన్నికల సామగ్రి సైతం సోమవారం జిల్లా కేంద్రానికి చేరింది. పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, ఒక కుటుంబం ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉండేలా మార్పులు, చేర్పులు వంటి ప్రక్రియలు చేపట్టారు. ప్రధానంగా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఆగస్టు 31 నాటికి పూర్తి చేశారు. ఓటరు జాబితాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించారు.

జిల్లాలో గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికార యంత్రాంగం ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నాటికే సిద్ధం చేసింది. అయితే ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్లను విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల ఏడో తేదీన కేటగిరీ వారీగా విభజించిన తుది ఓటరు జాబితాలను సైతం సిద్ధం చేశారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితాల తయారీ, క్రమబద్ధీకరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పలు మార్లు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతానికి పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితాలను పక్కాగా సిద్ధం చేశారు.

అటు అధికారులు... ఇటు రాజకీయ పార్టీలు

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక వైపు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుండగా, మరో వైపు రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. సోమవారం జిల్లా కేంద్రానికి ఎన్నికల సామగ్రి వచ్చింది. వాటిని జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. ఈ విధంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండగా, రాజకీయ పార్టీలు తమ నేతలు, ప్రజలతో ఇప్పటికే మండల, పంచాయతీల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం రాజకీయ పార్టీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Sep 29 , 2026 | 12:03 AM