స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:31 AM
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు.
ఇప్పటికే ఓటర్ల జాబితాలు సిద్ధం
నెలాఖరు నాటికి పోలింగ్ కేంద్రాలు ఖరారు
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల విభజనకు నిర్ణయం
తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
7న కేటగిరీల వారీగా తుది ఓటరు జాబితాల ప్రకటన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, ఒక కుటుంబం ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా మార్పులు, చేర్పులు వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి.
పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఈనెలాఖరుకు పూర్తి చేసి 31న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. కాగా తాజాగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా ఓటర్లను సైతం కేటగిరీల వారీగా విభజించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల విభజనకు ఆదేశాలు
ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్లను విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాలను ఈ ఏడాది ఏప్రిల్ 15న పంచాయతీల వారీగా ప్రదర్శించారు. వాటి ఆధారంగా జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు.. మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 3,460 పోలింగ్ కేంద్రాలున్నాయి. పురుషులు 2 లక్షల 41 వేల 447 మంది, మహిళలు 2 లక్షల 56 వేల 997 మంది, ఇతరులు 23 మంది కలిపి మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లున్నారని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్ తెలిపారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65 వేల 374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38 వేల 286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. జిల్లాలో ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంటింటా సర్వే, 23, 24 తేదీల్లో ఓటర్ల మ్యాపింగ్, 25న పంచాయతీల నోటీసు బోర్డుల్లో ప్రదర్శన, 26 నుంచి 28 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29 నుంచి సెప్టెంబరు 2 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం, ముసాయి జాబితా సిద్ధం చేయడం, సెప్టెంబరు 3 నుంచి 6 వరకు ఆయా ఓటర్ల నిర్ధారణకు గ్రామసభల నిర్వహణ, 7న తుది ఓటరు జాబితా ప్రకటన వంటి ప్రక్రియలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.