పర్యాటక ప్రాంతాల్లో జీసీసీ స్టాళ్లు
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:36 AM
పర్యాటక ప్రాంతాల్లో జీసీసీ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ఆ సంస్త చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు.
జిల్లాలో 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం
చింతపల్లిలో సూపర్‌బజార్ పునరుద్ధరణ
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
చింతపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
పర్యాటక ప్రాంతాల్లో జీసీసీ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ఆ సంస్త చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. శనివారం చౌడుపల్లి జీసీసీ గ్యాస్ గోదామును ఆయన తనిఖీ చేశారు. అనంతరం డివిజనల్ కార్యాలయంలో జీసీసీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ జీసీసీ ఉత్పత్తులను ప్రతి ఒకరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సందర్శక ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈఏడాది కాఫీ గింజలకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యంగా చేసుకున్నామన్నారు. చింతపల్లిలో జీసీసీ సూపర్‌బజార్‌ను పునరుద్ధరిస్తామన్నారు. ఇక్కడ జీసీసీ ఉత్పత్తులతోపాటు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చింతపల్లిలో గ్యాస్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మైదాన ప్రాంతాల మాదిరిగా గిరిజన ప్రాంతంలోనూ గ్యాస్ సిలిండర్ విడిపించుకునేందుకు 45 రోజుల కాలపరిమితిని సడలించి 25 రోజులుగా చేయాలని హెచ్‌పీ గ్యాస్ ప్రతినిధులకు లేఖ రాస్తామని జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్ అన్నారు. జీసీసీ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావడంతోపాటు గిరిజనులకు మెరుగైన సేవలందించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీజీఎం సూర్యనారాయణ, డీఎం సరమండ విజయకుమార్, మేనేజర్లు సల్లంగి సుగునాథం, గసాడి మల్లేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు, మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, ఏఎంసీ డైరెక్టర్ పెదిరెడ్ల బేతాళుడు, టీడీపీ నాయకులు రీమల ఆనందరావు, సోమేశ్, అర్జున్, చిన్న పాల్గొన్నారు.