Share News

జీబీఎస్‌కు విమ్స్‌లో చికిత్స

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:46 AM

గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతు న్న రోగులకు విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు.

జీబీఎస్‌కు విమ్స్‌లో చికిత్స

అందుబాటులో ఖరీదైన వైద్యం

ఎన్టీఆర్‌ వైద్య సేవలో భాగంగా ఉచితం

ఇటీవల ఓ మహిళకు రూ.8 లక్షల విలువైన ఇంజక్షన్లు

బ్రెయిన్‌ స్ర్టోక్‌, జీబీఎస్‌, నరాల సమస్యలతో ఆస్పత్రికి భారీగా రోగులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతు న్న రోగులకు విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఎంతోమంది రోగులు విమ్స్‌లో చేరి కోలుకున్నారు. తాజాగా ఓ మహిళకు సుమారు రూ.8 లక్షలు విలువజేసే అత్యాధునిక వైద్య సేవలను అందించారు.

ఇటీవల జీబీఎస్‌ బారినపడిన 32 ఏళ్ల మహిళ ఆస్పత్రి లో చేరారు. వ్యాధి తీవ్రంగా ఉండడంతో వైద్యులు వెంటనే రూ.15 వేలు విలువజేసే 25 ఐవీఐజీ ఇంజక్షన్లను అందిం చారు. అప్పటికీ మహిళ కోలుకోకపోవడంతో మరో 25 ఇంజక్షన్లు ఇవ్వడంతో క్రమంగా కోలుకుంది. కొన్ని రోజుల చికిత్సలో సదరు మహిళకు రూ.8 లక్షలు విలువజేసే 50 ఇంజక్షన్లు అందించారు. వీటన్నింటినీ ఎన్టీఆర్‌ వైద్య సేవ లో భాగంగా ఉచితంగా అందించి ప్రాణాలను నిలబె ట్టారు. గత ఏడాది ఈ వ్యాధితో బాధపడుతున్న 18 మందికి ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. కోలుకున్న రోగులకు ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐదుగురికి వైద్యమందించారు. జీబీఎస్‌ వ్యాధితో బాధపడేవారికి వైద్య సేవలు అందించేం దుకు అనుగుణంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఇంజక్షన్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు తెలిపారు.

భారీగా బ్రెయిన్‌ స్ర్టోక్‌ కేసులు..

గతంతో పోలిస్తే నరాల సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి మూడు కేసుల్లో ఒక బ్రెయిన్‌ స్ర్టోక్‌ కేసు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారికి మూడు గంటల వ్యఽవధిలో సుమారు రూ.50 వేలు విలువజేసే ఇంజక్షన్లు అందించాల్సి ఉంటుంది. గత ఏడాది 503 మందికి, ఈ ఏడాది ఇప్పటివరకు 200 మందికి ఉచితంగా అందించారు.

నాణ్యమైన వైద్య సేవలు

నరాల సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఖరీదైన వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది. బ్రెయిన్‌స్ర్టోక్‌, తలనొప్పి, ఎపిలెప్సీ, నరాల బలహీనత, పెరాలసిస్‌, మాస్క్యులర్‌ డిస్ర్టోఫీ, జీబీఎస్‌ వంటి వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాం. బ్రెయిన్‌స్ర్టోక్‌, జీబీఎస్‌ బారినపడిన రోగులకు రూ.లక్షలు విలువజేసే ఖరీదైన ఇంజక్షన్లు అందించి ప్రాణాలు నిలబెట్టాం.

- డాక్టర్‌ కె.రాంబాబు, విమ్స్‌ డైరెక్టర్‌

Updated Date - Apr 12 , 2026 | 12:46 AM