వైభవంగా గవరపాలెం గౌరమ్మ ఉత్సవం
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:13 AM
ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున నాలుగు గంటలకు గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
- నూకాంబిక ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
- రథోత్సవాన్ని ప్రారంభించిన ఎస్పీ తుహిన్‌సిన్హా
- దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు
- ఉత్సవానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి టౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున నాలుగు గంటలకు గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాతుడ్రు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. పురవీధుల్లో ఊరేగుతున్న రథం వద్దకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడిని ఉత్సవ కమిటీ చైర్మన్ సంతోష్ అప్పారావునాయుడు సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. నూకాంబిక అమ్మవారి ఆలయం తరఫున ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న వీరిని ఉత్సవకమిటీ చైర్మన్ సత్కరించి అమ్మవారి జ్ఞాపికలను బహూకరించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించారు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మాజీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు, వైసీపీ నాయకులు మలసాల భరత్‌కుమార్, బొడ్డేడ ప్రసాద్, మందపాటి జానకిరామరాజు, కూటమి నాయకులు గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. వీరిని చైర్మన్ సంతోష్ అప్పారావునాయుడు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఉత్సవంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నేలవేషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం నుంచే గవరపాలెం రహదారులన్నీ సందడిగా మారాయి. రాత్రి 35 కూడళ్లల్లో ఉత్సవ కమిటీ సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథలు, డ్యాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పట్టణ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ సిబ్బందితో చర్యలు చేపట్టారు. ఎస్పీ తుహిన్‌సిన్హా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేసిన స్టేజిలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ ప్రేమ్‌కుమార్ ఉన్నారు.