గ్యాస్ ట్రబుల్
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:43 AM
జిల్లాలో డెలివరీ ఇవ్వాల్సిన గ్యాస్ సిలిండర్ల జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. యుద్ధం నేపథ్యంలో వినియోగదారులు ఆందోళనతో అవసరం లేకున్నా సిలిండర్ బుక్ చేస్తున్నారు. అదే అధికారుల కొంప ముంచుతోంది. జిల్లాలో బుధవారం నాటికి ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 1,69,049గా పౌర సరపరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే గ్యాస్ ఏజెన్సీల ద్వారా రోజుకు సగటున 18,281 మందికే సిలిండర్లు ఇవ్వగలుగుతున్నారు. ఈ లెక్కన ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి సిలిండర్లను ఇవ్వడానికే ఎనిమిది రోజుల సమయం పడుతుంది. ఈలోగా మళ్లీ బుకింగ్‌లు యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. అందుకే అధికారులు అవసరం లేనివారు సిలిండర్ బుక్ చేయవద్దని సూచిస్తున్నారు.
పెరిగిపోతున్న పెండింగ్ జాబితా
ఇవ్వాల్సిన సిలిండర్లు 1,69,049
సగటున రోజుకు 18,281 డెలివరీ
ఈ లెక్కన ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి
సరఫరా చేసేందుకే ఎనిమిది రోజులు
పడుతుందంటున్న అధికారులు
బుకింగ్ తగ్గితేనే పరిస్థితి మెరుగయ్యే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో డెలివరీ ఇవ్వాల్సిన గ్యాస్ సిలిండర్ల జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. యుద్ధం నేపథ్యంలో వినియోగదారులు ఆందోళనతో అవసరం లేకున్నా సిలిండర్ బుక్ చేస్తున్నారు. అదే అధికారుల కొంప ముంచుతోంది. జిల్లాలో బుధవారం నాటికి ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 1,69,049గా పౌర సరపరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే గ్యాస్ ఏజెన్సీల ద్వారా రోజుకు సగటున 18,281 మందికే సిలిండర్లు ఇవ్వగలుగుతున్నారు. ఈ లెక్కన ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి సిలిండర్లను ఇవ్వడానికే ఎనిమిది రోజుల సమయం పడుతుంది. ఈలోగా మళ్లీ బుకింగ్‌లు యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. అందుకే అధికారులు అవసరం లేనివారు సిలిండర్ బుక్ చేయవద్దని సూచిస్తున్నారు.
జిల్లాలో 61 గ్యాస్ ఏజెన్సీలు మనుగడలో ఉన్నాయి. వాటిలో హెచ్‌పీసీఎల్‌కు చెందినవి 28, బీపీసీఎల్ 10, ఐఓసీఎల్ 23 ఉన్నాయి. వారి దగ్గర వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 8,039 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాణిజ్య సంస్థ రోజుకు సగటున ఐదు నుంచి పది వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. డొమెస్టిక్ అయితే నెలకు ఒకసారే తీసుకుంటారు. వ్యాపార సంస్థలకు నిత్యం అవసరం కాబట్టి కనెక్షన్ల సంఖ్య తక్కువ ఉన్నా వినియోగం అధికం. అయితే వారికి యుద్ధం నేపథ్యంలో 20 శాతమే ఇస్తున్నారు. ప్రస్తుతం వీరి కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద 2,099 సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రాధాన్యం ప్రకారం కేటాయిస్తున్నారు.
గృహ వినియోగదారుల విషయానికి వస్తే మొత్తం 8,34,430 కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సిలిండర్‌లో 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. అదే వాణిజ్య సిలిండర్ అయితే 19 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని 61 ఏజెన్సీల వద్ద 33,308 డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందినవి ఎక్కువ ఉన్నాయి. అన్ని ఏజెన్సీలూ కలిపి రోజుకు సగటున 18 వేల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. అంతకు మించి చేయడానికి వారి వద్ద మానవ వనరులు లేవు. అధికారుల లెక్క ప్రకారం రోజుకు 1,640 వాణిజ్య సిలిండర్లు, 18,388 డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు 730 వాణిజ్య, 18,281 డొమెస్టిక్ సిలిండర్లు ఇవ్వగలుగుతున్నారు.
బుకింగ్ తగ్గితేనే పరిస్థితి మెరుగు
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌పీజీ నిల్వలు అవసరాలకు సరిపడా ఉన్నాయని, అందోళన చెందవద్దని చెబుతున్నా గృహ వినియోగదారులు పట్టించుకోవడం లేదు. నగరంలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతంలో 45 రోజులు సిలిండర్ బుకింగ్ గడువు పెట్టినా ఎవరూ పాటించడం లేదు. ఇదిలావుంటే కొంతమంది పేదలు రెండు, మూడు నెలలకు ఒక సిలిండర్ మాత్రమే ఉపయోగిస్తుంటారు. అటువంటి వారిలో కొందరు ఇప్పుడు సిలిండర్ బుక్ చేసి, డెలివరీ రాగానే బయట మార్కెట్‌లో దుకాణాలకు రూ.500 లాభానికి అమ్ముకుంటున్నారు. దాంతో గతంలో ఎన్నడూ లేనంతగా బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. అవసరం ఉన్నవారు మాత్రమే బుక్ చేసుకుంటే ఈ సమస్య రాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.