గ్యాస్ లేక.. హోటళ్లు మూత
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:47 AM
వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన కంపెనీలు బాగా తగ్గించడంతో ఆ ప్రభావం అన్ని రకాల హోటళ్లపై తీవ్రంగా పడింది. గ్యాస్ సిలిండర్లు డెలివరీ కాకపోవడంతో పలువురు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. మరికొందరు కట్టెలతో వంటలు చేస్తూ, కొన్నిరకాల ఆహార పదార్థాలను వండడం ఆపేశారు. వాణిజ్య వంటగ్యాస్ సరఫరా కాకపోవడంతో తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, ఆదాయం పడిపోయిందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.
అదే బాటలో పలు టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు
కొన్నిచోట్ల కట్టెలపొయ్యిలపై వంటలు
పెరిగిన నిర్వహణ ఖర్చులు
గిట్టుబాటు కావడంలేదంటూ ఆహార పదార్థాల ధరల పెంపు
అచ్యుతాపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన కంపెనీలు బాగా తగ్గించడంతో ఆ ప్రభావం అన్ని రకాల హోటళ్లపై తీవ్రంగా పడింది. గ్యాస్ సిలిండర్లు డెలివరీ కాకపోవడంతో పలువురు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. మరికొందరు కట్టెలతో వంటలు చేస్తూ, కొన్నిరకాల ఆహార పదార్థాలను వండడం ఆపేశారు. వాణిజ్య వంటగ్యాస్ సరఫరా కాకపోవడంతో తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, ఆదాయం పడిపోయిందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో వందకుపైగా చిన్నాచితక హోటళ్లు ఉన్నాయి. వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో 80 శాతానికిపైగా హోటళ్లను మూసేశారు. మిగిలిన హోటళ్ల నిర్వాహకులు కట్టెపొయ్యిలపై వంటలు చేస్తున్నారు. చెట్ల కలపతోపాటు కోత మిల్లుల్లో వ్యర్థాలుగా వచ్చే చెక్క ముక్కలను (రద్దు) కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్‌తోపోలిస్తే కట్టెలపై వంట చేయడం వల్ల ఖర్చులు పెరిగాయంటూ హోటళ్ల నిర్వాహకులు ఆహార పదార్థాల ధరలు పెంచారు. చిన్నపాటి హోటళ్లలో గతంలో రూ.20కి నాలుగు ఇడ్లీ ఇచ్చేరు. ప్రస్తుతం వీటిని మూడుకు తగ్గించేశారు. రెండు కోడిగుడ్లతో కూరను రూ.35కి ఇచ్చేవారు. దీని ధర రూ.45కి పెంచారు.
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని కర్మాగారాల్లో పనిచేసే కార్మికులతోపాటు ఉద్యోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనాలు సరఫరా కాంట్రాక్టు తీసుకున్న హోటళ్ల వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్యాస్ సరఫరా లేకపోయినప్పటికీ ఒప్పందం ప్రకారం ఆయా కంపెనీలకు ఆహార పదార్థాలను వండి, సరఫరా చేయాల్సిందే. దీంతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకొని ఆపసోపాలు పడుతూ వంటలు చేస్తున్నారు. గ్యాస్ పొయ్యిలపై వండినంత వేగంగా కట్టెలపొయ్యిలపై వంటలు చేయలేకపోతున్నారు. అంతేకాక చాలా మంతి కుక్‌లకు కట్టెల పొయ్యిలపై వంట చేయడంలో అంతగా అనుభవం లేదు.