సీలేరులో గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:49 PM
అల్లూరి జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ తీసుకున్న 45 రోజుల వరకు మరొకటి బుక్ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంపై మండిపడుతున్నారు.
25 రోజులే వస్తున్న సిలిండర్
గ్యాస్ కోసం ఏజెన్సీ వద్ద పడిగాపులు
45 రోజుల బుకింగ్ విధానాన్ని మార్చాలని వినియోగదారులు డిమాండ్
హోటళ్లలో కనిపిస్తున్న డొమస్టిక్ సిలిండర్లు
బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు
సీలేరు, ఏప్రిల్ 19 (ఆధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో గిరిజన ప్రైమరీ కో-ఆపరేటివ్ సొసైటీ హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది. సీలేరు, ధారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల పంచాయతీలలో 1,500 నుంచి 2 వేల మంది వినియోగదారులున్నారు. ఇరాక్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ సంస్థలు సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది. దీంతో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో మన్యంలో గ్యాస్‌పై వంటలు చేసేవారు కాదు. కట్టెలు, బొగ్గుల పొయ్యిలపై వంటలు చేసేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం పొగరాని పొయ్యిలను వాడాలంటూ గిరిజనులకు అవగాహన కల్పించారు. అనంతరం గిరిజనులకు సబ్సిడీపై గ్యాస్ స్టవ్‌లను సరఫరా చేశారు. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా గ్యాస్ స్టవ్‌లపైనే ఆధారపడుతున్నది. ఒక కుటుంబానికి సిలిండర్ 30 రోజులు వస్తుంది. ఇప్పుడు 45 రోజుల వరకు బుకింగ్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు వంటలు ఒకపూటే చేసుకుంటున్నారు. మరొకొందరు బ్లాక్‌లో రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నారు. పోనీ కట్టెల పొయ్యి పెట్టుకుందామంటే కట్టెలు అమ్మేవారు లేరు. గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో వినియోగదారులు ప్రతి రోజూ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి వారిని బతిమాలుకుంటున్నారు. తాము ఏమీ చేయలేమని.. బుక్ చేసుకుంటే ఓటీపీ చెబితే గ్యాస్ సిలిండర్ ఇస్తామని గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. కొందరైతే డిస్టిబూటర్ మనసు కరిగి సిలిండర్ ఇస్తాడని ఆశతో ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు కాస్తున్నారు. అయినా సిలెండర్ దొరక్క ఊసురోమని ఇంటిముఖం పడుతున్నారు. అయితే గృహ అవసరాల సిలిండర్లు హోటళ్లలో దర్శినమిస్తున్నాయని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని హోటళ్లలో వాణిజ్య సిలిండర్లు కనబడడంలేదు. గృహ అవసరాల సిలిండర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా పౌరసరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మన్యంలో 45 రోజులకు సిలిండర్ బుకింగ్ విధానాన్ని తీసేసి.. 25 రోజులకు సిలిండర్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.