గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:31 AM
వంట గ్యాస్ సమస్య రోజురోజుకూ జిల్లాలో పెరుగుతోంది. ఇప్పటికే సిలిండర్ కోసం చాలామంది ఏజెన్సీలు చుట్టూ తిరుగు తున్నారు. గ్యాస్ ఇబ్బందులతో నగరంలో అనేక హోటళ్లు మూతపడుతున్నాయి. విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్‌పైనా వంట గ్యాస్ కొరత ప్రభావం పడింది.
ఏఎంసీ హాస్టళ్లకు తగినంత సరఫరా లేకపోవడంతో కొన్ని వంటలు కట్టెల పొయ్యిపై తయారీ
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
మరోవైపు ఏజెన్సీలో ముందు క్యూలు
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
వంట గ్యాస్ సమస్య రోజురోజుకూ జిల్లాలో పెరుగుతోంది. ఇప్పటికే సిలిండర్ కోసం చాలామంది ఏజెన్సీలు చుట్టూ తిరుగు తున్నారు. గ్యాస్ ఇబ్బందులతో నగరంలో అనేక హోటళ్లు మూతపడుతున్నాయి. విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్‌పైనా వంట గ్యాస్ కొరత ప్రభావం పడింది. ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని ఎంబీబీఎస్, పీజీ వసతి గృహాలను నాలుగు రోజుల నుంచి గ్యాస్ సమస్య వేధిస్తోంది. ఆశించిన స్థాయిలో గ్యాస్ సరఫరా లేకపోవడంతో నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాలకు చెందిన రెండు మహిళా వసతి గృహాల్లో సుమారు 500 మంది ఎంబీబీఎస్ విద్యార్థినులు, మరో 50 మంది వరకు పీజీ విద్యార్థినులు ఉంటున్నారు. రెండు పురుషుల వసతి గృహాల్లో 464 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 150 మంది పీజీ విద్యార్థులు ఉంటున్నారు. ఈ నాలుగు వసతి గృహాల్లో వంట అవసరాల కోసం ప్రతినెలా 270 వరకు సిలిండర్లు కావాల్సి ఉంటుంది. అయితే, నాలుగు రోజులు నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో పొదుపుగా వినియోగించడంపై అధికారులు దృష్టిసారించారు. కొన్ని రకాల వంటలను అంటే అన్నం, పప్పు, సాంబారు వంటి వాటిని కట్టెల పొయ్యిపై వండాలని సిబ్బందికి సూచించారు. వేపుళ్లు, కర్రీల వంటి వాటి కోసం మాత్రం గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్‌ను కూడా కొనుగోలు చేశామని, వంటలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యాదేవి తెలిపారు. సమస్యను డీఎంఈ దృష్టికి తీసుకువెళ్లామని, ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన సిలిండర్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కూడా అవసరమైన సిలిండర్లు అందిస్తామని చెప్పినట్టు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.