Share News

గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:05 AM

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత అలజడి సృష్టిస్తోంది. కృత్రిమ కొరత అధికమవుతోంది.

గ్యాస్‌ కష్టాలు

కొరత కొంత...కృత్రిమ డిమాండ్‌ కొండంత

ఎడాపెడా బుకింగ్‌లతో సక్రమంగా పనిచేయని సర్వర్లు

ఏజెన్సీలకు వినియోగదారుల పరుగులు

గతంలో 48 గంటల్లో డెలివరీ...

ఇప్పుడు 4 రోజులపైనే...

హోటళ్లకు అందని గ్యాస్‌...ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత అలజడి సృష్టిస్తోంది. కృత్రిమ కొరత అధికమవుతోంది. గ్యాస్‌ ఏజెన్సీలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ రూ.1,500కు అమ్ముడవుతోంది. అధికారులు దాడులు చేస్తున్నా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

గృహ వినియోగదారులకు అవసరమైన గ్యాస్‌కు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఉండబోవని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా చాలామంది ఆందోళన చెందుతూ ముందుజాగ్రత్తతో సిలిండర్‌ బుక్‌ చేసుకుంటున్నారు. దాంతో గ్యాస్‌ కంపెనీల సర్వర్లు మొరాయిస్తున్నాయి. బుకింగ్‌లు ఆగిపోతున్నాయి. ఇంతకు ముందు ఈ పరిస్థితి లేదు. అవసరమైనప్పుడే సిలిండర్‌ బుక్‌ చేసుకునేవారు. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఎందుకైనా మంచిదని ప్రతి ఒక్కరూ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నగరాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు సిలిండర్‌ బుకింగ్‌కు గడువు విధించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ గందరగోళంలో అత్యవసరమైన వారికి కూడా గ్యాస్‌ బుకింగ్‌ కావడం లేదు. దాంతో కొందరు గ్యాస్‌ బుక్‌, సిలిండర్‌ పట్టుకొని ఏకంగా ఏజెన్సీల వద్దకే వెళ్లిపోతున్నారు. అక్కడ క్యూ కట్టి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. గతంలో బుక్‌ చేసిన 48 గంటల్లోనే సిలిండర్‌ డెలివరీ ఇచ్చేవారు. ఇప్పుడు కనీసం ఐదు రోజులు పడుతుందని చెబుతున్నారు. గ్యాస్‌ బాయ్‌ తేవడం ఆలస్యం అవుతుందని, వినియోగదారులు వస్తే వెంటనే తీసుకువెళ్లిపోవచ్చునని డీలర్లు చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా ఇండేన్‌, భారత్‌ గ్యాస్‌ కంపెనీల ఏజెన్సీల వద్దే కనిపిస్తోంది.

హోటళ్లకు, వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో వారంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరైతే వ్యాపారాలు మూసేస్తున్నారు. దసపల్లా హోటల్‌ యాజమాన్యం అయితే ఎందుకైనా మంచిదని శుక్రవారం ఒక లారీలతో కట్టెలు తెప్పించుకుంది. సాంబారు, మటన్‌, చికెన్‌ వంటి నాన్‌వెజ్‌ వంటకాలను కట్టెల పొయ్యిలపై చేస్తారని తెలిసింది.

చిన్న హోటళ్లు గ్యాస్‌ బాయ్‌ల వద్ద డొమెస్టిక్‌ సిలిండర్లు ఒక్కొక్కటి రూ.1,500కు బ్లాకులో కొని వ్యాపారాలు నడుపుతున్నారు. గిట్టుబాటు కాకపోయినా తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ హాస్టళ్లకు ఢోకా లేదు

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డొమెస్టిక్‌ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. చినగదిలి, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కప్పరాడ, గాజువాక ఇలా అన్ని ప్రాంతాల్లోని విద్యార్థుల హాస్టళ్లలో గ్యాస్‌పైనే వంటలు చేస్తున్నారు. సింహాచలం గురుకులంలో ఎందుకైనా మంచిదని కట్టెలు సిద్ధం చేసుకున్నారు.

బ్లాక్‌లో విక్రయాలు

ఇదే అదనుగా భావిస్తున్న కొందరు గ్యాస్‌ బాయ్‌లు డొమెస్టిక్‌ సిలిండర్లను బ్లాకులో రూ.500 లాభానికి అమ్ముకుంటున్నారు. 14.2 కిలోల సిలిండర్‌ రూ.960 పడుతుండగా, దానిని రూ.1,500కు విక్రయిస్తున్నారు. ఈ యావలో పడి రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డెలివరీలను ఆలస్యం చేస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖాధికారులు శుక్రవారం కూడా సోదాలు చేసి నగరంలో 24 డొమెస్టిక్‌ సిలిండర్లను పట్టుకున్నారు. అదేవిధంగా గాజువాకలో మరో 17 సిలిండర్లు పట్టుకున్నారు. ఈ సోదాలు కొనసాగిస్తామని, బ్లాకులో విక్రయిస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఒక్కొక్కటిగా హోటళ్ల మూత

బాలకృష్ణ, చైర్మన్‌,

విశాఖ హోటల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

వాణిజ్య సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కొందరికైతే కొద్దికొద్దిగా అందుతున్నాయి. వాటితోనే వ్యాపారం అంతా నడపలేకపోతున్నారు. చిన్న హోటళ్లు అయితే ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కేజీహెచ్‌ పరిసరాల్లో శుక్రవారం ఐదారు హోటళ్లు మూసేశారు. పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నాం. బీచ్‌రోడ్డులో కొందరు కట్టెల పొయ్యలపై వంటలు చేస్తున్నారు.


ఏజెన్సీలకు ఒక్కొక్క లోడే...

మల్కాపురం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

హెచ్‌పీసీఎల్‌ అనుబంధ లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) ప్లాంటులో ఫిల్లింగ్‌ తగ్గించారు. గతంలో ఒక్కో ఏజెన్సీకి రెండు లోడ్‌లు (700 సిలిండర్లు) పంపేవారు. కానీ గురువారం నుంచి ఒక్క లోడ్‌ (350 సిలిండర్లు) మాత్రమే పంపుతున్నారు. ఈ ప్లాంటులో గతంలో రోజుకు 12 వేల నుంచి 15 వేల సిలిండర్లు ఫిల్‌ చేసేవారు. ఇప్పుడు గ్యాస్‌ కొరత వల్ల రోజుకు ఎనిమిది వేల సిలిండర్లు మాత్రమే ఫిల్‌ అవుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా రోజుకు రెండు లోడ్‌లు సరఫరా చేయలేమని, కేవలం ఒక్క లోడ్‌ మాత్రమే పంపగలమని ఏజెన్సీలకు సంస్థ నుంచి సమాచారం ఇచ్చారు.

గ్యాస్‌ ఏజెన్సీల వద్ద బారులు

గాజువాక, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాల వద్ద శుక్రవారం వినియోగదారులు బారులుతీరారు. అయితే గ్యాస్‌ కోసం ఎవరూ రావద్దని, బుక్‌ చేసుకుంటే వరుస క్రమంలో ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామని ఏజెన్సీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం కొరత అంతగా లేదని, బుకింగ్‌ చేసుకున్న వారం రోజుల్లోనే సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 01:05 AM