గ్యాస్ ధరల పెంపు
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:44 AM
యుద్ధం నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్, ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోవడంతో కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచింది.
సిలిండర్‌పై రూ.60
కొత్త ధర రూ.921
యుద్ధం నేపథ్యంలో కొరత
బుకింగ్‌కు నిబంధనలు
సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజులు, రెండు సిలిండర్లు ఉంటే నెల తరువాత మాత్రమే అవకాశం
విశాఖపట్నం/మల్కాపురం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
యుద్ధం నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్, ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోవడంతో కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచింది. గృహాల్లో (డొమెస్టిక్) వినియోగించే సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.60, వాణిజ్య సిలిండర్ (19 కిలోలు)పై రూ.114 పెరిగింది. డొమెస్టిట్ సిలిండర్ పాత ధర రూ.860 కాగా కొత్త ధర రూ.921. అలాగే వాణిజ్య సిలిండర్ పాత ధర రూ.1,816 కాగా కొత్త ధర రూ.1,930గా ప్రకటించింది. ఇవి శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలకు సంబంధించి 13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా సిలిండర్ తీసుకునే వారి సంఖ్య ఏడు లక్షలు. ఇప్పుడు ఒక్కొక్కరిపై నెలకు రూ.60 చొప్పున ఏడు లక్షల మందిపై రూ.4.2 కోట్ల ఆర్థిక భారం పడుతుంది.
సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయి
గ్యాస్ పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు కంపెనీలు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ ఇస్తూ వచ్చాయి. గతంలో ఒకసారి గ్యాస్ కొరత ఏర్పడినప్పుడు ‘ఇన్ని రోజులు తరువాత’ మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలనే నిబంధన అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి నిబంధనే పెట్టారు. వినియోగదారుడికి ఒక సిలిండర్ మాత్రమే ఉంటే...ఒకసారి సిలిండర్ తీసుకున్న తరువాత 21 రోజులు ఆగాకే మళ్లీ బుక్ చేసుకోవాలి. అంతకు ముందు చేస్తే నమోదు చేసుకోరు. అదేవిధంగా రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులైతే సిలిండర్ డెలివరీ తీసుకున్నాక నెల (30) రోజులు ఆగి మళ్లీ బుక్ చేసుకోవాలి. యుద్ధ వాతావరణం సమసిపోయి మళ్లీ గ్యాస్ నిల్వలు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
సరఫరాలో కోత లేదు
యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌కు కొరత ఏర్పడిందని, అందుకే రేట్లు పెంచారని ప్రచారం జరుగుతోంది. అయితే గ్యాస్ డీలర్లకు సిలిండర్లను సరఫరా చేయడంలో ఎలాంటి జాప్యం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రేటు పెరిగే అవకాశం ఉండడంతో శుక్రవారం మాత్రం డెలివరీలు ఇవ్వలేదని తెలిసింది. ఇప్పుడు యథా ప్రకారం బుకింగ్స్ అన్నీ తీసుకొని 24 గంటల్లోనే డెలివరీ ఇస్తున్నట్టు డీలర్లు చెబుతున్నారు.
మే నెలాఖరుకు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం
వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోపే అందుబాటులోకి తీసుకువస్తాం
విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రహదారులు ఏడింటినీ మే నెలాఖరుకు పూర్తి చేస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు రూ.120.29 కోట్లతో పనులు చేపట్టామన్నారు. వాస్తవానికి ఈ రహదారుల నిర్మాణానికి రూ.174.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, వాటికి రూ.120.29 కోట్లతో టెండర్లు పిలవగా, 22.76 శాతం తక్కువకు రూ.92.9 కోట్లతో పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకువచ్చారన్నారు. జూన్ లేదా జూలైలో విమానాశ్రయం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, తాము మాత్రం మే నెలాఖరుకే రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. అడవివరం-శొంఠ్యాం రహదారికి అటవీ శాఖ భూములు అవసరమని, వారికి లేఖ రాశామని, దీనిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఢిల్లీ స్థాయిలో మాట్లాడుతున్నారన్నారు. కొన్ని రహదారుల్లో అక్కడక్కడా న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా త్వరగా పరిష్కరించి 100 శాతం రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
నిత్యం సమీక్ష: కమిషనర్
మాస్టర్ ప్లాన్ రహదారుల పనులను నిత్యం సమీక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపడుతున్నామన్నారు.
రైల్వేస్టేషన్‌కు అదనపు ప్లాట్‌ఫారం
విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా అదనపు ప్లాట్‌ఫారం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం రూ.500 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎనిమిది ప్లాట్‌ఫారాలు ఉండగా, వాటికి అదనంగా మరో ఆరు నిర్మించడానికి ఆమోదం పొందారు. అందులో భాగంగా జ్ఞానాపురం వైపు అదనపు ప్లాట్‌ఫారం నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. దశల వారీగా అన్ని పనులు చేపట్టనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
ఆర్టీసీ విశాఖ రీజియన్ మేనేజర్ ప్రకటన
ద్వారకా బస్‌స్టేషన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు విశాఖ రీజియన్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. పరీక్ష ప్రారంభ సమయానికి ముందు మూడు గంటల నుంచి, ముగిసిన తరువాత మూడు గంటల వరకూ ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. అందుకు విద్యార్థులు హాల్ టికెట్లు చూపితే సరిపోతుందన్నారు. ఈ మేరకు రీజియన్‌లో ఏడు డిపోల మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.