గ్యాస్ సిలిండర్ల దందా గుట్టురట్టు
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:39 PM
పెదబయలు జీసీసీ గ్యాస్ గోడౌన్‌లో సిలిండర్ల దందా గుట్టురట్టు అయ్యింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్ల తరలింపునకు యత్నించడంతో స్థానికులు పట్టుకొని డిప్యూటీ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన స్పందించి ఆర్‌ఐ, వీఆర్‌వో గ్యాస్ గోడౌన్‌కు పంపించారు. వారు సిలిండర్లు, బొలెరో వ్యాన్‌ను సీజ్ చేశారు.
పదుల సంఖ్యలో పక్కదారి పట్టిస్తున్న జీసీసీ గోడౌన్ సిబ్బంది
అక్రమ రవాణాపై డీటీకి ఫిర్యాదు
45 సిలిండర్లు, బొలెరో వాహనం సీజ్
పెదబయలు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక జీసీసీ గోడౌన్‌కు గ్యాస్ సిలిండర్ల లోడ్ శుక్రవారం ఉదయం వచ్చింది. దీంతో లబ్ధిదారులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూలో నిలబడి ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులను పక్కన పెట్టి గోడౌన్ సిబ్బంది లోడుతో వచ్చిన వాహనం నుంచి 45 గ్యాస్ సిలిండర్లను ప్రైవేటు బొలెరో వాహనంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని అక్కడే గ్యాస్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న లబ్ధిదారులు, మాజీవార్డు సభ్యుడు గండేరు జీవన్ కుమార్ అడ్డుకున్నారు. సిలిండర్ల తరలింపునకు అవసరమైన పత్రాలను చూపించమని నిలదీశారు. వారి వద్ద పత్రాలు లేకపోవడంతో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ జి. రంగారావుకు ఫిర్యాదు చేశారు. డీటీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ పూర్ణయ్య, వీఆర్‌వో మౌనిక గోడౌన్ వద్దకు చేరుకుని పక్కదారి పట్టిస్తున్న 45 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. వాటిని గోడౌన్‌లో భద్రపరిచారు. అలాగే సిలిండర్ల తరలింపునకు ఉపయోగించిన బొలెరో వ్యాన్‌ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గ్యాస్ కోసం సామాన్య లబ్ధిదారులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడుతుంటే కొంతమంది వ్యక్తులకు పెద్ద సంఖ్యల్లో సిలిండర్లు ఎలా తరలిస్తున్నారని స్థానికులు ప్రశ్నించారు. లబ్ధిదారునికి ఓటీపీ లేకుండా ఒక్క సిలిండర్ కూడా ఇవ్వని జీసీసీ గోడౌన్ సిబ్బంది పదుల సంఖ్యల్లో సిలిండర్లు ఎలా తరలిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ గోడౌన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నట్టు అధికారుల వద్ద లబ్ధిదారులు ఆరోపించారు. జీసీసీ గోడౌన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.