Share News

గ్యాస్‌ సంక్షోభం

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:13 AM

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విశాఖపట్నంలో ఏకంగా ఆ సిలిండర్ల ఫిల్లింగ్‌నే ఆపేశారు. నిల్వలు ఉన్నంత మేరకు గ్యాస్‌ ఏజెన్సీలకు, వారి నుంచి ముఖ్యమైన ఖాతాదారులకు మాత్రమే అవి అందుతున్నాయి.

గ్యాస్‌ సంక్షోభం

వాణిజ్య సిలిండర్ల ఫిల్లింగ్‌ పూర్తిగా నిలిపివేత

నిల్వల మేరకు అరకొరగా సరఫరా

అందరికీ అందని సిలిండర్లు

ఇదే పరిస్థితి కొనసాగితే నేడో రేపో ఒక్కొక్కటిగా మూత

సమస్య పరిష్కరించాలంటూ జేసీని కలిసిన హోటళ్ల అసోసియేషన్‌ ప్రతినిధులు

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విశాఖపట్నంలో ఏకంగా ఆ సిలిండర్ల ఫిల్లింగ్‌నే ఆపేశారు. నిల్వలు ఉన్నంత మేరకు గ్యాస్‌ ఏజెన్సీలకు, వారి నుంచి ముఖ్యమైన ఖాతాదారులకు మాత్రమే అవి అందుతున్నాయి. ఇంతకు ముందులా అడిగిన వ్యాపారులందరికీ వాణిజ్య సిలిండర్లు ఇవ్వడం లేదు. డీలర్లకు మంగళవారం నుంచే పూర్తిగా ఆపేశారు. కొందరికి బుధవారం అరకొరగా ఇచ్చారు. గురువారం నుంచి ఇక అవి కూడా ఉండవని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలోని హోటళ్లు ఒక్కొక్కటిగా మూతపడే పరిస్థితి వస్తుంది. దీనిని తప్పించడం కేంద్రం మినహా ఇంకెవరి వల్ల కాదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

విశాఖపట్నంలో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు, మెస్‌లు, రోడ్డు పక్కన టిఫిన్‌ దుకాణాలన్నీ కలిపి సుమారు రెండు వేల వరకు ఉన్నాయి. వాటికి సగటున రోజుకు నాలుగు వేల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు అవసరం. ఆ మేరకు సరఫరా జరిగితేనే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తాయి. ప్రస్తుతం కొందరి వద్ద అరకొరగా ఉన్న నిల్వలను వారికి ముఖ్యమైన హోటళ్లకు అంటే...రెగ్యులర్‌గా తీసుకుంటూ, వెంటనే బిల్లులు ఇచ్చే వారికి మాత్రమే అందిస్తున్నారు. అవి కూడా ఎనిమిది అవసరమైన చోట నాలుగు, ఐదు అడిగిన వారికి రెండు చొప్పున ఇస్తున్నారు. మిగిలిన వారికి అవి కూడా అందడం లేదు. ఒక స్థాయి కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు కొద్దిమొత్తంలో అంటే రెండు రోజులకు సరిపడా గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచుకుంటాయి. ప్రస్తుతం సరఫరా ఆగిపోవడంతో అవి కూడా అయిపోవస్తున్నాయి. గురువారం నుంచి సిలిండర్లు ఇవ్వకపోతే హోటళ్లను నడపలేని పరిస్థితి ఉంది.

అందుబాటులో 1.08 లక్షల డొమెస్టిక్‌ సిలెండర్లు

జిల్లా అధికారుల సమాచారం ప్రకారం వాణిజ్య సిలిండర్ల ఫిల్లింగ్‌ ఆగిపోయింది. కేవలం డొమెస్టిక్‌ సిలిండర్లు మాత్రమే ఫిల్లింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.08 లక్షల డొమెస్టిక్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రోజుకారోజు అదనంగా వస్తాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా 9 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. వారిలో రోజుకు 20 నుంచి 25 వేల మంది సిలిండర్లు బుక్‌ చేసుకుంటారు. ప్రస్తుతానికి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేదు. అయితే ఒకసారి గ్యాస్‌ డెలివరీ తీసుకున్న తరువాత వెంటనే మళ్లీ బుకింగ్‌ కాదు. రెండో సిలిండర్‌ బుకింగ్‌ కనీసం 25 రోజుల సమయం తీసుకోవాలి. అదే డబుల్‌ సిలిండర్లు ఉన్నట్టయితే 30 రోజులలోపు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు వినియోగదారులకు ఆ సమాచారం కూడా మెసేజ్‌ రూపంలో పంపుతున్నారు. మీరు ఫలానా తేదీ తరువాతే గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలని స్పష్టంగా చెబుతున్నారు.

జేసీని కలిసిన హోటళ్ల అసోసియేషన్‌ ప్రతినిధులు

వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో, తమ వ్యాపారాలు మూతపడతాయని, సుమారు రెండు లక్షల మంది ఉపాధి కోల్పోతారని, తక్షణమే గ్యాస్‌ సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నం హోటల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం సాయంత్రం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరిని కలిశారు. డిమాండ్‌ మేరకు కాకపోయినా సగమైనా ఇవ్వాలని, లేదంటే వ్యాపారాలు ఆగిపోవడంతో పాటు, ప్రజలు, పర్యాటకులు కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని అసోసియేషన్‌ అధ్యక్షులు బాలకృష్ణ తెలిపారు.

ఆస్పత్రులు, హాస్టళ్లకు డొమెస్టిక్‌ సిలిండర్లు

ఆస్పత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్లనే అందించేవారు. ఇప్పుడు అవి అందుబాటులో లేకపోవడం, ఆయా సంస్థలు ముఖ్యమైనవి కావడంతో వాటికి డొమెస్టిక్‌ సిలిండర్లు ఇవ్వాలని పైనుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Mar 12 , 2026 | 01:13 AM