Share News

గ్యాస్‌, పెట్రోల్‌కు కటకట

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:25 AM

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం జిల్లాలో వంట గ్యాస్‌, పెట్రోల్‌ సరఫరాపై చూపింది. దీంతో జిల్లాలో వాణిజ్య గ్యాస్‌ కొరత ఏర్పడగా, గృహావసర గ్యాస్‌పై పరిమితులు నెలకొన్నాయి. ఇక పెట్రోల్‌ బంకుల్లో చమురు నిల్వలు లేక మూతపడుతున్నాయి.

గ్యాస్‌, పెట్రోల్‌కు కటకట
పాడేరులో ఐటీడీఏ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద వినియోగదారులు

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం

అరకొరగా వాణిజ్య గ్యాస్‌ సరఫరా

పరిమితులతో గృహావసర గ్యాస్‌ పంపిణీ

చమురు లేక పాడేరులో మూడు బంకులు మూత

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం జిల్లాలో వంట గ్యాస్‌, పెట్రోల్‌ సరఫరాపై చూపింది. దీంతో జిల్లాలో వాణిజ్య గ్యాస్‌ కొరత ఏర్పడగా, గృహావసర గ్యాస్‌పై పరిమితులు నెలకొన్నాయి. ఇక పెట్రోల్‌ బంకుల్లో చమురు నిల్వలు లేక మూతపడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా గ్యాస్‌ కొరత నేపథ్యంలో గత వారం నుంచే జిల్లాలో వాణిజ్య గ్యాస్‌ లభ్యత అరకొరగా జరుగుతున్నది. దీంతో వాణిజ్య గ్యాస్‌పై ఆధారపడి నిర్వహించే హోటళ్లు, చిరు తినుబండారాల దుకాణాలపై తీవ్ర ప్రభావం చూపింది. ధర పెరిగినా వాటిని కొనుగోలు చేసి తమ హోటళ్లు దుకాణాలు నడపాలని యజమానులు భావిస్తున్నప్పటికీ, వాణిజ్య గ్యాస్‌ ఆశించినంతగా లభించని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పలు హోటళ్లు, చిరు తినుబండారాల దుకాణాలు మూసేశారు. అలాగే తప్పని సరి పరిస్థితుల్లో పలు హోటళ్లలో గృహావసర గ్యాస్‌ను వినియోగిస్తూ కాలం నెట్టుకు వస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో అర్థంకాని దుస్థితి నెలకొందని పలువురు యజమానులు ఆందోళన చెందుతున్నారు. పలు హోటళ్లలో అన్నిరకాల వంటకాలు కాకుండా కేవలం బిరియాని మాత్రమే వండుతున్న పరిస్థితి ఉంది.

సగం బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం సగం బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో మొత్తం ఏడు బంకులు ఉండగా, సోమవారం చమురు లేని కారణంగా మూడు బంకులను మూసేశారు. అలాగే విశాఖపట్నం నుంచి ఎప్పుడు డీజిల్‌, పెట్రోల్‌ వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని బంకు యజమానులు అంటున్నారు. అయితే క్రమంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపైనా పరిమితులు నెలకొనే అవకాశఽముందని అంటున్నారు. దీంతో వాహన యజమానులు తమ అవసరాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గృహావసర గ్యాస్‌ పంపిణీకి పరిమితులు

దేశంలో గ్యాస్‌ కొరత నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతానికి గృహావసర గ్యాస్‌కు తీవ్ర ఇబ్బందులు లేనప్పటికీ, పరిమితులతో సరఫరా చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉన్న 21 రోజుల బుకింగ్‌ను 45 రోజులకు పెంచడంతో పాటు పక్కాగా పాస్‌ బుక్‌, ఈకేవైసీ అయిన వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు. గతంతో పోలిస్తే అంత స్వేచ్చగా గ్యాస్‌ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ పరిధిలో గతంలో ప్రతి రోజు 300 నుంచి 400ల గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ అయ్యేవి. తాజా పరిణామాల నేపథ్యం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితులు మరీ ఇబ్బందిగా లేనప్పటికీ, మరో వారం దాటితే మాత్రం గృహావసర గ్యాస్‌ సరఫరా సైతం ఎలా ఉంటుందనేది చెప్పలేమని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:26 AM