చెత్తశుద్ధి కరవు
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:45 AM
చెత్తను పర్యావరణహితంగా కాపులుప్పాడలోని యార్డుకు తరలించేందుకు జోన్‌ల వారీగా ఏర్పాటుచేసిన క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) పేరుతో వివిధ జోన్‌లలో ఏర్పాటుచేసిన ప్లాంట్లు ప్రస్తుతం పనిచేయడం లేదు.
సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణలో మహా వైఫల్యం
గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లలో కొండలా పేరుకుపోయిన చెత్త
పని చేయని సీసీఎస్ ప్రాజెక్టులు
కాంట్రాక్టర్ నిర్వాకమే కారణం
రెండు ప్లాంట్ల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకుని రెండు నెలలైనా పని ప్రారంభించని ‘రాసా’ సంస్థ
గాజువాక ప్లాంటును
కొత్తకాంట్రాక్టర్‌కు అప్పగించకుండా దాగుడుమూతలు
ప్రస్తుతం ఓపెన్ టిప్పర్ల ద్వారా కాపులుప్పాడ తరలిస్తున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
చెత్తను పర్యావరణహితంగా కాపులుప్పాడలోని యార్డుకు తరలించేందుకు జోన్‌ల వారీగా ఏర్పాటుచేసిన క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) పేరుతో వివిధ జోన్‌లలో ఏర్పాటుచేసిన ప్లాంట్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. రెండు ప్లాంట్ల నిర్వహణ దక్కించుకున్న ఓ సంస్థ పని ప్రారంభించడంలో తాత్సారం చేస్తోంది. అదే సంస్థ..మరొక ప్లాంటు నిర్వహణను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించకుండా దాగుడుమూతలాడుతోంది. దీంతో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లలో చెత్త కొండలా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో అధికారులే ఓపెన్ టిప్పర్లతో చెత్తను కాపులుప్పాడ తరలిస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలోని నివాసాలు, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, మార్కెట్‌ల నుంచి వచ్చే చెత్తను సమీపంలోని జోన్‌ల పరిధిలో ఏర్పాటుచేసిన గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లకు క్లాప్ వాహనాల ద్వారా చేరుస్తారు. అక్కడ చెత్తను నేలపై వేయకుండా క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ పేరుతో ఏర్పాటుచేసిన గల్లాలో అన్‌లోడ్ చేస్తారు. ప్లాంటులోని ప్రత్యేక యంత్రాలు గల్లాలో పడిన చెత్తను కేక్ మాదిరిగా కంప్రెస్ చేసి, కంటెయినర్ లాంటి హుక్‌లోడర్‌లోకి లోడ్ చేస్తాయి. అలా కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఒక్కో జోన్‌లో సీసీఎస్ ప్లాంట్‌కు వచ్చే చెత్త పరిమాణం ఆధారంగా హుక్‌లోడర్లు (కంటెయినర్‌లాంటి లారీలు)ను జీవీఎంసీయే కొనుగోలు చేసి, వాటి నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. జీవీఎంసీ పరిధిలో ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లిలో సీసీఎస్ ప్రాజెక్టులను ఏర్పాటుచేసి కాంట్రార్లకు అప్పగించింది. గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణను ‘రాసా’ సంస్థ చాలాకాలంగా చేపట్టగా, ముడసర్లోవలోని సీసీఎస్ ప్రాజెక్టును మంజునాథ సంస్థ ఇప్పటికీ నిర్వహిస్తోంది. అయితే జీవీఎంసీ ఒక్కో ప్లాంటు నిర్వహణకు ఏడాదికి సగటున రూ.2 కోట్లు వరకూ వెచ్చిస్తున్నాసరే, కాంట్రాక్టర్లు చెత్తను పూర్తిగా తరలించడం లేదనే ఫిర్యాదులు కొన్నాళ్ల కిందట వెల్లువెత్తాయి. దీనిపై కమిషనర్ కేతన్‌గార్గ్ స్పందించి ప్రాజెక్టులను స్వయంగా తనిఖీ చేయగా, టౌన్ కొత్తరోడ్డు, గాజువాక ప్లాంట్ల వద్ద అవకతవకలు బయటపడ్డాయి. జీవీఎంసీ సమకూర్చిన హుక్ లోడర్లను సైతం మూలనపెట్టేసి, నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణానికి హాని కలించేలా ఓపెన్ టిప్పర్లతో చెత్తను కాపులుప్పాడ తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ నుంచి రూ.81 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని మెకానికల్ విభాగం అధికారులు కాంట్రాక్టర్ నుంచి ఎన్నో ప్రయత్నాల తర్వాత రాబట్టారు.
ప్లాంట్లను మూసేసిన కాంట్రాక్టర్
జీవీఎంసీ పరిధిలోని గాజువాక, చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డు, ముడసర్లోవలోని సీసీఎస్ ప్రాజెక్టులను ఎనిమిది నెలలపాటు నిర్వహణకు రెండు నెలల కిందట జీవీఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డు ప్రాజెక్టులను గతంలో ఆ ప్రాజెక్టులను నిర్వహించిన ‘రాసా’ సంస్థ తిరిగి దక్కించుకోగా, గాజువాక, ముడసర్లోవ ప్రాజెక్టులను మంజునాథ సంస్థ దక్కించుకుంది. టెండరు నిబంధనల ప్రకారం గాజువాక ప్రాజెక్టును రాసా సంస్థ కొత్తగా టెండరు దక్కించుకున్న మంజునాథ సంస్థకు అధికారికంగా ఆడిట్‌చేసి అప్పగించాలి. అయితే ఇంతవరకూ గాజువాక ప్లాంట్‌ను కొత్తకాంట్రాక్టర్‌కు అప్పగించలేదు. దీంతో ఆ ప్లాంటులో సీసీఎస్ ప్రాజెక్టును వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. గాజువాక జోన్ పరిధిలోని చెత్తను కొద్దికొద్దిగా ఓపెన్ టిప్పర్ల ద్వారా కాపులుప్పాడ యార్డుకు తరలిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి సమస్య తలెత్తుతోంది. మరోవైపు యార్డులో చెత్త పూర్తిగా తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డు ప్రాజెక్టులను ‘రాసా’ సంస్థ తిరిగి దక్కించుకున్నందున ఆ ప్లాంట్‌లను ఎలాంటి ఆడిట్ అవసరం లేకుండానే యథావిధిగా పనిచేయించేందుకు అవకాశం ఉంది. కానీ ఇంతవరకూ ఆచూకీ లేదు, దీంతో ఆ రెండు ప్లాంట్లలో చెత్తను కూడా అధికారులే ఓపెన్ టిప్పర్లను సమకూర్చుకుని కాపులుప్పాడ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాసాపై అమితమైన ప్రేమ
రెండు ప్లాంట్లను నిర్వహించకుండా ముఖం చాటేయడంతోపాటు, గాజువాక ప్లాంటును కొత్తకాంట్రాక్టర్‌కు అప్పగించకుండా దాగుడుమూతలు ఆడుతున్న ‘రాసా’పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకనో వెనుకాడుతున్నారు. కాంట్రాక్టర్ ఎవరైనా టెండరు దక్కించుకుని పని ప్రారంభించకపోతే నిబంధనల ప్రకారం రద్దు చేసి ఎల్2గా నిలిచిన వారికి అప్పగించేందుకు అఽధికారులకు అధికారం ఉంటుంది. కానీ టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఎందుచేతనో అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్న కాంట్రాక్టు సంస్థకు ఇప్పటికే అధికారులు మూడు నోటీసులు జారీచేసినా అటువైపు నుంచి కనీసం స్పందన లేదు. జీవీఎంసీలోని కొందరు ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయిలో మునిసిపల్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు సంబంధిత కాంట్రాక్టర్‌కు అండగా ఉండడం వల్లే అధికారులు జారీచేసిన నోటీసులకు స్పందించడం లేదనే అభిప్రాయం జీవీఎంసీ అధికారుల్లో వ్యక్తమవుతోంది.