షిప్‌యార్డు ఇన్‌చార్జి సీఎండీగా గండి వెంకటేశ్వర్లు
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:26 AM
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు ఇన్‌చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కెప్టెన్ గండి వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు.
మల్కాపురం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు ఇన్‌చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కెప్టెన్ గండి వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఎండీగా ఉన్న గిరిదీప్‌సింగ్ శనివారం పదవీ విరమణ చేశారు. నేవీలో 25 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వెంకటేశ్వర్లు 2018 మే నెలలో అదనపు జనరల్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత షిప్ బిల్డింగ్ విభాగపు డైరెక్టర్‌గా 2024 నవంబరులో పదోన్నతి పొందారు. ఇప్పుడు సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
పార్కులు, మ్యూజియాలకు ఫెసిలిటీ మేనేజర్లు
వీఎంఆర్‌డీఏ నిర్ణయం
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ‘ఫెసిలిటీ మేనేజర్ల’ను నియమించుకుంటోంది. పబ్లిక్ ఆస్తుల నిర్వహణలో అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనుంది. వీఎంఆర్‌డీఏకు నగరంలో సిటీ సెంట్రల్ పార్క్, తెన్నేటి పార్క్, వీఎంఆర్‌డీఏ పార్కు, కైలాసగిరి, బీచ్ రోడ్డులో నేవల్ మ్యూజియాలతో పాటు సిరిపురంలో చిల్డ్రన్ ఎరీనా, తొట్లకొండ ఉన్నాయి. వీటికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆదాయమూ వస్తోంది. వీటి నిర్వహణ ప్రస్తుతం రెవెన్యూ విభాగం చూసుకుంటోంది. వారికి అనేక బాధ్యతలు ఉండడం వల్ల టికెటింగ్, పరిశుభ్రత, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఆదాయానికి గండి కూడా పడుతోంది. అందుకని ఆ ఆస్తులను పరిరక్షించడంతో పాటు రోజు వారీ నిర్వహణ బాధ్యతలు చూడడానికి ‘ఫెసిలిటీ మేనేజర్లు’ను తీసుకోవాలని నిర్ణయించింది. ప్రమాదాలు జరగకుండా, అవసరమైతే మరమ్మతులు చేయిస్తూ, ప్రమాణాలు పాటిస్తూ సంస్థలో ఇంజనీరింగ్, రెవెన్యూ, కాంట్రాక్టర్లు, వెండర్లకు సమన్వయకర్తల్లా పనిచేయాల్సి ఉంటుంది. ఎంబీఏ, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో పదేళ్ల అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఇచ్చారు. ఇలాంటి వారిని సరఫరా చేసే సంస్థలు కూడా బిడ్లు వేసుకునే అవకాశం కల్పించారు.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 35,404 మంది విద్యార్థులు హాజరు
159 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
మద్దిలపాలెం, జనవరి 31:
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఫిబ్రవరి 10 తేదీ వరకూ జరగనున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 35,404 మంది (ఎంపీసీ 30,433, బైసీపీ 4,971 మంది) హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 159 కేంద్రాలను ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాటుచేశారు. ఆదివారం నుంచి నిర్వహించే తొలి విడత పరీక్షలు 120 కేంద్రాల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఉదయం పరీక్షల జవాబు పత్రాలను 12.30 నుంచి 1.30 గంటలలోపు, మధ్యాహ్నం పరీక్షల జవాబు పత్రాలను 5.30 నుంచి 6.30 గంటలలోపు మూల్యంకనం చేస్తారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు జిల్లా బోర్డు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పూర్తిస్థాయి ల్యాబ్ సదుపాయాలున్న 159 కళాశాలలను కేంద్రాలుగా ఎంపికచేశారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 0891-2567561, 99089 59873 నంబర్‌లలో సంప్రతించాలని ఆర్‌ఐవో మురళీధర్ తెలిపారు.
భూ విలువల పెంపు వాయిదా
జాయింట్ కలెక్టర్ వద్దే ప్రతిపాదనలు
ప్రస్తుతానికి పాత విలువలతోనే రిజిస్ర్టేషన్లు
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
భూముల విలువ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెంచిన విలువలు అమలు చేయాలని వారం క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆగమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేసి, వాటిపై ప్రజల నుంచి అభ్యంతారాలు కూడా ఆహ్వానించారు. కొందరు తగ్గించాలని కోరితే, మరికొందరు పెంచాలంటూ లేఖలు అందజేశారు. వాటిపై జిల్లా కమిటీ సమీక్షించి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నదీ నిర్ణయించి, ఆ ప్రతిపాదనలను కమిటీ కన్వీనర్ అయిన జాయింట్ కలెక్టర్‌కు సమర్పించింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆ ఫైల్‌పై సంతకం చేసి తిరిగి జిల్లా రిజిస్ట్రార్‌కు అందించేవారు. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో కన్వీనర్ సంతకాలు ఆగిపోయినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పాత విలువలతోనే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుందని, ఆ విధంగానే చేస్తామని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.
కొత్త విలువలు అప్‌లోడ్ చేయవద్దని ఆదేశాలు
భూముల విలువల పెంపు ఒకటో తేదీ నుంచి అమలు కావడం లేదని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం శనివారం రాత్రి సమాచారం పంపింది. ఇప్పుడు పెంచిన కొత్త విలువలను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయవద్దని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. అంటే పాత విలువలపైనే స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. మళ్లీ ఆదేశాలు వచ్చేంత వరకు పాత విలువలే ఉంటాయి.
సామాజిక ఫింఛన్లు 90.36ు మందికి పంపిణీ
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
సామాజిక పింఛన్లు శనివారం సాయంత్రానికి జిల్లాలో 90.36 శాతం మందికి పంపిణీ చేశారు. అన్ని కేటగిరీలు కలిపి 1,58,945మంది ఉండగా, 1,44,332 మందికి పింఛన్లు అందజేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,392 మందికి రూ.11.12 కోట్లు విడుదల కాగా, 24,351 మంది (91.94 శాతం)కి రూ.10.22 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,32,553 మందికి రూ.58.4 కోట్లు మంజూరుకాగా 1,19,981 మంది (90.06 శాతం)కి రూ.52.6 కోట్లు అందజేసినట్టు డీఆర్‌డీఏ పీడీ బి.లక్ష్మిపతి తెలిపారు. మిగిలిన వారికి పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు.