వ్యసనంగా గేమింగ్
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:51 AM
పిల్లలు ఫోన్‌కు బానిసలై చేస్తున్న దారుణాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే.
బానిసలవుతున్న పిల్లలు, యువత
అభ్యంతరం చెబుతున్న కుటుంబ సభ్యులపై దాడులు
భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతున్న వైనం
పెరుగుతున్న పర్సనాలిటీ డిజార్డర్ సమస్యలు
ప్రాథమిక దశలోనే గుర్తించడం కీలకం అంటున్న మానసిక వైద్యులు
లేనిపక్షంలో విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘ఫోన్‌కు దూరంగా ఉండు. చెడు తిరుగుడులు తిరగొద్దు. జాగ్రత్తగా చదువుకో. ఫోన్‌లో ఎక్కువసేపు ఆటలాడొద్దు...’’అని చెప్పినందుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు కుమారుడు. ఈ ఘటన రాజాంలో చోటుచేసుకుంది.
‘‘రాత్రి సమయంలో మొబైల్‌లో గేమ్ ఆడుతున్న తమ్ముడిని వారించింది అక్క. ఒకటికి పదిసార్లు చెప్పినా వినకపోవడంతో ఫోన్ పక్కనపెట్టి పడుకో అంటూ గట్టిగా గదమాయించింది. దీనిని సహించలేకపోయిన ఆ యువకుడు...అక్కపై చేయి చేసుకున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ యువకుడు కత్తితో అక్కను నరికేశాడు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను పొడిచాడు. ఆ తరువాత గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది.
పిల్లలు ఫోన్‌కు బానిసలై చేస్తున్న దారుణాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇటువంటివి అనేకచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహా ఆలోచనలు పెరగడం ఆందోళనకరమని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు నొక్కి చెబుతున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారిన పిల్లల్లో ఇటువంటి వ్యవహారశైలిని ఎక్కువగా గమనిస్తున్నట్టు చెబుతున్నారు.
పర్సనాలిటీ డిజార్డర్
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారిన పిల్లల్లో డ్రగ్స్, మత్తు పానీయాలు తీసుకునే అలవాటు కూడా ఉంటుందని, వాటిని అత్యంత జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొందరు చెడు స్నేహాలకు అలవాటుపడి దారుణాలు చేయడాన్ని చాలా సులభమైన విషయంగా భావిస్తుంటారని, బంఽధాలు గురించి పెద్దగా పట్టించుకోరని అంటున్నారు. ఈ తరహా వ్యసనాలకు లోనైన పిల్లల్లో పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఆ సమస్యతో బాధపడే వారిలో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం ఉండదంటున్నారు. గేమ్ వద్దని చెప్పినా, ఆడకుండా ఉండాలని సూచించినా...తేలికగా తీసుకోకుండా తీవ్రస్థాయిలో స్పందిస్తుంటారు. ఈ స్పందన కొన్ని సందర్భాల్లో విపరీత పరిణామాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో తమను తాము ఏదో ఒకటి చేసుకునేందుకు యత్నిస్తుంటారని, అతికొద్ది సందర్భాల్లో మాత్రమే వద్దని వారించిన వారిపై దాడులకు పాల్పడుతుంటారని, వారిని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనలు చేస్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరహా ఆలోచనలు పిల్లల్లో పెరగడానికి సినిమాలు, క్రైమ్ స్టోరీలు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
లక్షణాలతో ముందే గుర్తించే చాన్స్
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారిన వారిని ముందే గుర్తించేందుకు అవకాశం ఉంది. ప్రాథమిక దశలో అయితే కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఎక్కువ సమయం ఫోన్ చూస్తుండడం, ఒంటరిగా గదికి పరిమితమై ఫోన్‌తో కాలక్షేపం చేయడం, కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించకపోవడం, చదువును నిర్లక్ష్యం చేయడం, ఏ పని చెప్పినా చిరాకు పడడం, తీవ్రమైన అసహనం, కోపం, కొన్నిసార్లు భోజనం సరిగా చేయకపోవడం, ఇంటికి సమయానికి రాకపోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నిరంతరం ఇరిటేషన్‌తో కనిపిస్తుంటారు.
ఒకేసారి హెచ్చరికలతో సమస్య పరిష్కారం కాదు
- డాక్టర్ జి.భాగ్యారావు, మానసిక వైద్య నిపుణులు
ఫోన్, ఇతర వ్యసనాలకు బానిసలైన పిల్లలకు ఒకేసారి తీవ్రమైన హెచ్చరికలు చేయడం ద్వారా దారిలోకి తెచ్చుకునే అవకాశం లేదు. ప్రాథమికంగా వాళ్లు వ్యసనానికి లోను కాకుండా చూడాలి. గంటల తరబడి ఫోన్‌కు అతుక్కుంటున్నాడు అనుకుంటున్న సమయంలో మెల్లగా వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లేలా చేయాలి. ఒత్తిడి చేయడం, కొట్టడం, గదమాయించడం వంటి వాటి ద్వారా వారిలోని భావోద్వేగాలను మరింత తీవ్రస్థాయికి వెళ్లేలా చేయకూడదు. సన్నిహితంగా ఉంటూ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. చేయి దాటిందని భావించినప్పుడు కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్లాలి. అవసరమైతే అడ్మిట్ చేయాలి. మందులు, కౌన్సెలింగ్ ద్వారా సమస్యను తగ్గించి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. పిల్లలను నిరంతరం పర్యవేక్షించే ఇళ్లలో ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి, అప్రమత్తతతో వ్యవహరించడం అత్యంత కీలకం.