జూదాలకు సై
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:15 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున జూదాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. కోడి పందేలు, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడంలేదు. కూటమిలో ఒక ప్రధాన పార్టీ నేతల అండదండలు వున్నాయని వీరు చెబుతున్నారు.
అడ్డరోడ్డు తిమ్మాపురంలో కోడిపందేలు, గండాటల నిర్వహణకు ఏర్పాట్లు
పోలీసుల అభ్యంతరం లేకుండా చూస్తానని కూటమి నేతలు హామీ
ఎస్.రాయవరంలో రూ.5 లక్షలు, తిమ్మాపురంలో రూ.6 లక్షలు డిమాండ్?
ఎస్.రాయవరం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున జూదాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. కోడి పందేలు, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడంలేదు. కూటమిలో ఒక ప్రధాన పార్టీ నేతల అండదండలు వున్నాయని వీరు చెబుతున్నారు. పోలీసులు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా కోడిపందేలు, గుండాటలు నిర్వహించుకునేందుకు ఎస్.రాయవరంలో రూ.5 లక్షలు, తిమ్మాపురంలో (అడ్డరోడ్డు) రూ.6 లక్షలు ఇవ్వాలని సదరు నేతలు డిమాండ్ చేయగా, ఇందుకు స్థానిక నిర్వాహకులు అంగీకరించినట్టు తెలిసింది. తిమ్మాపురంలో హెటెరో కాలనీకి వెళ్లేదారిలో వున్న ఒక ఖాళీ స్థలంలో ఆదివారం టెంట్లు వేసే పనులు మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ మూడు రోజులతోపాటు తరువాత వచ్చే ఆదివారం వరకు గుండాట, కోడిపందేలు నిర్వహించుకునేందుకు పోలీసుల పరంగా తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సదరు చేతలు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆదివారం యుద్ధప్రాతిపదికన షెడ్లు వేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలకల్లా చాలా వరకు పనులు పూర్తిచేశారు.