Share News

జడ్పీ చైర్‌పర్సన్‌గా గాడు అలివేణి

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:18 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా గాడు అలివేణి, వైస్‌ చైర్మన్‌గా సుఖవాసి అజయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జడ్పీ చైర్‌పర్సన్‌గా గాడు అలివేణి

వైస్‌ చైర్మన్‌గా సుఖవాసి అజయ్‌

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఎంపీ భరత్‌, ఇతర ప్రజా ప్రతినిధులు

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా గాడు అలివేణి, వైస్‌ చైర్మన్‌గా సుఖవాసి అజయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఎన్నికలను నిర్వహించారు. ముందుగా సీఈవో పి.నారాయణమూర్తి సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం అక్షర క్రమంలో జడ్పీటీసీ సభ్యులు సుఖవాసి అజయ్‌ (పెందుర్తి), గాడు అలివేణి (భీమిలి), ఎన్ని శ్రీనివాసరావు (ఆనందపురం), కుచ్చర్లకోట అరుణకుమారి (పద్మనాభం)తో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణం చేయించారు. అనంతరం జడ్పీ ఎన్నిక జరుగుతుందని ప్రకటించారు. ఆనందపురం జడ్పీటీసీ సభ్యుడు ఎన్ని శ్రీనివాసరావు జడ్పీ చైర్‌పర్సన్‌గా భీమిలి జడ్పీటీసీ సభ్యురాలు గాడు అలివేణి పేరు ప్రతిపాదించగా పెందుర్తి జడ్పీటీసీ సభ్యుడు సుఖవాసి అజయ్‌ బలపరచగా మిగిలిన సభ్యులు తమ ఆమోదం తెలిపారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో చైర్‌పర్సన్‌గా అలివేణి ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని ప్రకటించగానే, గాడు అలివేణి లేచి వైస్‌ చైర్మన్‌ పదవికి సుఖవాసి అజయ్‌ పేరు ప్రతిపాదించగా పద్మనాంభం జడ్పీటీసీ సభ్యురాలు అరుణకుమారి బలపరచగా సభ్యులు తమ ఆమోదం తెలిపారు. దీంతో వైస్‌ చైర్మన్‌గా అజయ్‌ ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. తదుపరి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ కో-ఆపరేటివ్‌, గవర కార్పొరేషన్‌ చైర్మన్లు గండి బాబ్జీ, మళ్ల సురేంద్ర హాజరయ్యారు. కొత్తగా చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన గాడు అలివేణి, సుఖవాసి అజయ్‌తో ఎంపీ, కలెక్టర్‌, జడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్‌ ఫొటో దిగారు. సభ్యుల ప్రమాణం, చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ మొత్తం 20 నిమిషాలలో ముగిసింది. కాగా జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పటివరకు కొనసాగిన ప్రత్యేకాధికారి పాలన ముగిసింది. కొత్తగా ఎన్నికైన చైర్‌పర్సన్‌ గాడు అలివేణి, ఆమె భర్త, భీమిలి మాజీ జడ్పీటీసీ గాడు వెంకటప్పడును, వైస్‌ చైర్మన్‌ సుఖవాసి అజయ్‌కు పలువురు సన్మానించారు.

సమన్వయంతో జిల్లా అభివృద్ధి

సుఖవాసి అజయ్‌, వైస్‌ చైర్మన్‌, జడ్పీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుని కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడతా. జడ్పీ వైస్‌చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర నేతలకు కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

గాడు అలివేణి, జడ్పీ చైర్‌పర్సన్‌

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. నాకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటా. గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తా. ముఖ్యంగా రహదారులు, డ్రైన్లు, తాగునీరు, విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులకు ధన్యవాదాలు.


పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

డిసెంబరు 2న పోలింగ్‌

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు శనివారం నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24న నామినేషన్ల పరిశీలిస్తారని, వాటిపై అప్పీళ్లు 25న స్వీకరించి, 26న తీర్పు వెలువరిస్తారనారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందన్నారు. అదే రోజు మూడు గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారన్నారు. వచ్చే నెల రెండో తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించి అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాల ప్రకటిస్తారని కలెక్టర్‌ వెల్లడించారు. అదేరోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా జరుగుతుందని వెల్లడించారు. అనివార్య కారణాల చేత ఆలస్యమైతే డిసెంబరు మూడో తేదీ ఉదయం 10 గంటలకు ఉపసర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తారని వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ డా.శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ, డ్రోన్‌ చిత్రీకరణ చేయాలని, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల అదనపు భద్రత ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. జిల్లా పంచాయతీ ఎన్నికల అధికారి శ్రీనివాసరావు ఎన్నికల ఏర్పాట్లు వివరించారు. నాలుగు మండలాల్లో 802 పోలింగ్‌ కేంద్రాలు (ఆనందపురంలో 260, భీమునిపట్నంలో 166, పద్మనాభంలో 226, పెందూర్తిలో 150), 79 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. మొత్తం 1,62,407 మంది ఓటర్లు (79,630 మంది పురుషులు, 82,777 మంది మహిళలు) ఉన్నారన్నారు. ఆనందపురం మండలంలో 51,951 మంది, భీమునిపట్నలో 36,943 మంది, పద్మనాభంలో 21,638 మంది, పెందుర్తిలో 31,125 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆనందపురం మండలంలో 26 పంచాయతీలకు ఏడు, భీమునిపట్నంలోని 16 పంచాయతీలకు నాలుగు, పద్మనాభంలోని 22 పంచాయతీలకు ఆరు, పెందుర్తిలోని 15 పంచాయతీలకు ఆరు చొప్పున మొత్తం 23 నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటుచేశామని వెల్లడించారు. పోలింగ్‌ అధికారులుగా 882 మంది, సహాయ, ఇతర అధికారులుగా 1,351 మంది మొత్తం 2,233 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. కాగా పోలింగ్‌/కౌంటింగ్‌ రోజుతో పాటు డిసెంబరు 3వ తేదీ ఉదయం వరకు మద్యం షాపుల్లో అమ్మకాలు నిషేధం విధించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డీ అనిత, జిల్లా పరిషత్‌ సీఈవో నారాయణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 01:18 AM