Share News

అన్నదాతకు మరింత ఊరట

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:57 AM

జిల్లాలో మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. తరువాత ఆకాశం మేఘావృతమై నర్సీపట్నం, కోటవురట్లలో భారీ వర్షం కురిసింది. గొలుగొండ, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, రావికమతం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అనకాపల్లి, బుచ్చెయ్యపేట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇవే మండలాల్లో సోమవారం కూడా వర్షం పడడంతో వరినారుమళ్లకు జీవం పోసినట్టయ్యిందని రైతులు చెబుతున్నారు.

అన్నదాతకు మరింత ఊరట
కోటవురట్లలో వర్షం

వరుసగా రెండో రోజూ కూడా పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

వరినారుమడులు, కూరగాయ, అపరాల పంటకు మేలు

అనకాపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): జిల్లాలో మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. తరువాత ఆకాశం మేఘావృతమై నర్సీపట్నం, కోటవురట్లలో భారీ వర్షం కురిసింది. గొలుగొండ, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, రావికమతం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అనకాపల్లి, బుచ్చెయ్యపేట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇవే మండలాల్లో సోమవారం కూడా వర్షం పడడంతో వరినారుమళ్లకు జీవం పోసినట్టయ్యిందని రైతులు చెబుతున్నారు.

నర్సీపట్నంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలే జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వెంకునాయుడు స్కూల్‌ రోడ్డు, శారదానగర్‌ రెండో లైన్‌లో మోకాలి లోతున నీరు నిలిచింది. గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా నాలుగో రోజు కూడా మోస్తరు వర్షం పడింది. దీంతో వరినారుమళ్లకు ఢోకా వుందని, అయితే భారీ వర్షాలు కురిస్తేనే నాట్లు వేయడానికి వీలుంటుందని రైతులు చెబుతున్నారు. కోటవురట్ల మండలంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు గంటపాటు భారీవర్షం కురిసింది. ఖరీఫ్‌ సీజన్‌లో తొలిసారి పొలాల్లో నీరు కనిపించిందని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాగా మెట్ట భూముల్లో ఇప్పటికే వేసిన పత్తి, అపరాలు, నూనె గింజల పంటలకు, కూరగాయ తోటలకు, వరి నారుమళ్లకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలంలో మూడు రోజుల నుంచి సాయంత్రం పూట వర్షం కురుస్తున్నది. ఇది వరి నారుమడులుకు, కూరగాయల పంటలకు ఊపిరి పోసింది మాడుగుల మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Updated Date - Aug 05 , 2026 | 12:57 AM