Share News

మరింత భూ సేకరణ

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:07 AM

మండలంలో పరిశ్రమల అవసరాల కోసం రెండవ విడతగా నాలుగు గ్రామాల్లో 93.292 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఐసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటికే రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబరులో 406 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిని పలువురు చిన్న, సన్నకారు రైతులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండడంతో ప్రభుత్వం ఎకరాకు రూ.9 లక్షల చొప్పున సుమారు రూ.40 కోట్లు పరిహారంగా అందజేసింది.

మరింత భూ సేకరణ
రాచపల్లిలో రెండో విడత సేకరించనున్న భూమి ఇదే

పరిశ్రమల కోసం రాచపల్లిలో మొదటి విడతలో 406 ఎకరాలు..

తాజాగా నాలుగు గ్రామాల్లో 93 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం

రైతులతో రెండు, మూడు రోజుల్లో అధికారుల సమావేశం

మాకవరపాలెం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో పరిశ్రమల అవసరాల కోసం రెండవ విడతగా నాలుగు గ్రామాల్లో 93.292 ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఐసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటికే రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబరులో 406 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిని పలువురు చిన్న, సన్నకారు రైతులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండడంతో ప్రభుత్వం ఎకరాకు రూ.9 లక్షల చొప్పున సుమారు రూ.40 కోట్లు పరిహారంగా అందజేసింది. ఇందులో 150 ఎకరాలను డోజ్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయించగా, పనులు ప్రారంభించింది. 24 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. మిగిలిన భూములను ఇటీవల సియట్‌ టైర్లు, బ్లాక్‌ స్టోన్‌ కంపెనీ, ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. రాచపల్లి సర్వే నంబరు 737లో ఇంకా 232 ఎకరాలు మాత్రమే మిగిలి వుండడం, ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న వారికి మరింత భూమి అవసరం ఏర్పడడంతో రెండో విడతగా ప్రభుత్వ భూములతోపాటు డి.పట్టా, జిరాయితీ భూములను సేకరించాలని ఏపీఐఐసీ అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పడంతో వారు రాచపల్లి, జడ్‌.గంగవరం, భీమబోయినపాలెం, శెట్టిపాలెం గ్రామాల్లో 93.292 ఎకరాలను సేకరించేందుకు సర్వే చేశారు. రాచపల్లి రెవెన్యూలో ప్రభుత్వం భూమి 3.337 ఎకరాలు, డి.పట్టా భూమి 7.882 ఎకరాలు, జిరాయితీ భూమి 76.423 ఎకరాలు, జడ్‌.గంగవరంలో ప్రభుత్వ భూమి 1.693 ఎకరాలు, జిరాయితీ భూమి 2.927 ఎకరాలు, భీమబోయినపాలెంలో 0.555 ఎకరాలు భూమి, శెట్టిపాలెంలో 0.475 ఎకరాలు సేకరిస్తారు. ఇందులో కొంత భూమిని 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం, మరికొంత భూమిని పరిశ్రమల కోసం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. భూ సేకరణకు సంబంధించి ఏపీఐఐపీ, రెవెన్యూ అధికారులు రెండు, మూడు రోజుల్లో ఆయా రైతులతో సమావేశం నిర్వహిస్తారని తెలిసింది.

Updated Date - Jun 26 , 2026 | 12:07 AM