నిప్పుల కొలిమి
ABN , Publish Date - May 21 , 2026 | 11:57 PM
జిల్లాలో అటు ఏజెన్సీని ఆనుకొని వున్న మండలాల మొదలు ఇటు సముద్ర తీరంలోని మండలాల వరకు గురువారం ఎండ మండిపోయింది. సాధారణంకంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
దేవరాపల్లిలో 45 డిగ్రీలు నమోదు
అనకాపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటు ఏజెన్సీని ఆనుకొని వున్న మండలాల మొదలు ఇటు సముద్ర తీరంలోని మండలాల వరకు గురువారం ఎండ మండిపోయింది. సాధారణంకంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీక్షణంగా కాయడంతో మధ్యాహ్నానికి పరిస్థితి ఎంత తీవ్రంగా వుంటుందో ప్రజలకు అర్థమైంది. దీంతో బయట పనులను త్వరగా ముగించుకొని ఇళ్లకే పరిమతం అయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాతావరణం నిప్పులకొలిమిలా మారింది. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. ఫుట్ పాత్ చిరువ్యాపారులతోపాటు పెద్ద వ్యాపారులు సైతం 11 గంటలకే దుకాణాలను మూసివేశారు. జిల్లాలో 24 మండలాలకుగాను 18 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైబడి నమోదయ్యాయి. అన్ని మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. దేవరాపల్లి మండలంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాలను పరిశీలిస్తే.. మాకవరపాలెంలో 44.3 డిగ్రీలు, చీడికాడలో 44.3, నాతవరంలో 44, బుచ్చెయ్యపేటలో 42.4, చోడవరంలో 43, కశింకోటలో 43.2, మాడుగులలో 43.3, నర్సీపట్నంలో 43.2, కె.కోటపాడులో 42.9, రావికమతంలో 42.5, గొలుగొండలో 42.6, కోటవురట్లలో 41.1, మునగపాకలో 40.6, పరవాడలో 41.7, రోలుగుంటలో 42.3, సబ్బవరంలో 41.7, అనకాపల్లిలో 40.1, అచ్యుతాపురంలో 37.2, నక్కపల్లిలో 38.7, పాయకరావుపేటలో 38.9, రాంబిల్లిలో 37.2, ఎస్.రాయవరంలో 39, ఎలమంచిలిలో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే విధంగా నమోదయ్యే అవకాశం వుండడం, తీవ్రవడగాడ్పులు వీయనుండడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొన్నది. కాగా దాహం వేయకపోయినా.. తరచూ నీరు తాగాలని, వాంతులు/ విరేచనాలు అవుతుంటే ఓఆర్‌ఎస్ లేదా నిమ్మ రసం కలిపిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.