Share News

నిధులు జాస్తి.. పనులు నాస్తి

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:59 AM

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పరిస్థితి. అధ్వానంగా వున్న అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మూడు నెలల క్రితం సుమారు ఐదు కోట రూపాయలు మంజూరు చేసినప్పటికీ.. సంబంధిత అధికారులు ఇంతవరకు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయలేదు. వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తిచేస్తే నాణ్యతగా వుంటాయని, అందువల్ల అధికారులు వెంటనే టెండర్లను పూర్తిచేసి పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిధులు జాస్తి.. పనులు నాస్తి
అధ్వాన్నంగా ఉన్న పీఎస్‌పేట- జన్నవరం రోడ్డు

మూడు నెలల క్రితమే మంజూరు చేసిన ప్రభుత్వం

ఇంతవరకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయని అధికారులు

వర్షాకాలం వస్తే పనులకు ఆటంకం

చోడవరం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పరిస్థితి. అధ్వానంగా వున్న అంభేరుపురం- రాయపురాజుపేట, పీఎస్‌పేట- జన్నవరం రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మూడు నెలల క్రితం సుమారు ఐదు కోట రూపాయలు మంజూరు చేసినప్పటికీ.. సంబంధిత అధికారులు ఇంతవరకు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేయలేదు. వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తిచేస్తే నాణ్యతగా వుంటాయని, అందువల్ల అధికారులు వెంటనే టెండర్లను పూర్తిచేసి పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే. అక్కడక్కడే ఒకటీఅరా రోడ్లకు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టలేదు. కానీ అప్పటి మంత్రులు మాత్రం ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. వీటిలో చోడవరం మండలంలోని చోడవరం- పీఎస్‌పేట-జన్నవరం, అంభేరుపురం- రాయపురాజుపేట రహదారులు వున్నాయి. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా కనీసం గోతులు అయినా పూడ్చకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో తమ రహదారులకు మోక్షం లభిస్తుందని ఆయా గ్రామాల ప్రజలు భావించారు. ఏడాదిన్నర ఆలస్యంగా అయినప్పటికీ ప్రభుత్వం గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద పీఎస్‌పేట మీదుగా జన్నవరం వరకు రహదారి అభివృద్ధికి రూ.2.83 కోట్లు, అంభేరుపురం నుంచి రాయపురాజుపేట వరకు రహదారి అభివృద్ధి, మధ్యలో కల్వర్టు నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నప్పటికీ అధికారులు ఇంతవరకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయలేదు. నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకొని వుంటే ఈపాటి పనులు జోరుగా సాగేవి. కానీ ఇప్పుడు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టడానికి కనీసం నెల రోజులు పడుతుందని, ఆ తరువాత నెల రోజులకే వర్షాకాలం మొదలవుతుందని, అప్పుడు పనులు కుంటుపడడంతోపాటు నాణ్యత లోపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:59 AM