‘పట్నం అభివృద్ధికి నిధుల వరద
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:26 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరవుతున్నాయి.
రెండున్నరేళ్లలో రూ.కోట్లు మంజూరు చేయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తాజాగా 206 పనులకు వీఎంఆర్‌డీఏ నుంచి రూ.25 కోట్లు..
రూ.20 కోట్లతో 201 సీసీ రోడ్ల నిర్మాణం
రూ.2 కోట్లతో మూడు ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్
రూ.1.8 కోట్లతో పెద్దచెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, పిల్లలకు క్రీడా పరికరాలు
రూ.1.2 కోట్లతో సత్యనారాయణ స్వామి కల్యాణ మండపం ఆధునికీకరణ
టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలో పనులు ప్రారంభం
నర్సీపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరవుతున్నాయి. తాజాగా వీఎంఆర్‌డీఏ మంజూరు చేసిన రూ.25 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసింది. మరికొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
నర్సీపట్నం మునిసిపాలిటీలో రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులు, వంతెనలు, పార్కుల అభివృద్ధితోపాటు పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు మెగా వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేలా కృషిచేస్తున్నారు. తాజాగా పట్టణంలో 206 అభివృద్ధి పనులకు వీఎంఆర్‌డీఏ నుంచి రూ.25 కోట్లు మంజూరు చేయించారు. ఈ పనులకు గత నెల 22న కుప్పం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అధికారులు గత నెల 29న టెండర్లు పిలవగా, అందరికన్నా తక్కువ రేట్లకు కోట్ చేసిన హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) పనులను దక్కించుకుంది. తాజాగా టెండర్ అగ్రిమెంట్ సైతం పూర్తికావడంతో కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించడానికి ఎన్‌సీసీ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మునిసిపాలిటీలో రూ.25 కోట్లతో చేపట్టనున్న 206 అభివృద్ధి పనుల్లో అత్యధికంగా రహదారులకు సంబంధించినవి వున్నాయి. వివిధ వార్డుల్లో 201 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించారు. రూ.1.8 కోట్లతో కొత్తవీధి సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్దచెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆటల పరికరాలు, లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.2 కోట్లతో ఐదు రోడ్ల కూడలి నుంచి అయ్యన్నపాలెం వరకు, పెదబొడ్డేపల్లి కూడలి నుంచి నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వరకు, పోలీస్ స్టేషన్ నుంచి అయ్యన్నపాలెం సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
రూ.1.2 కోట్లతో కల్యాణ మండపం ఆధునికీకరణ
బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయ కల్యాణ మండపాన్ని రూ.12 కోట్లతో ఆధునీకరిస్తారు. వాస్తవంగా 2014-19లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు అప్పట్లో మంత్రిగా వున్న అయ్యన్నపాత్రుడు సత్యనారాయణ స్వామి ఆలయం ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేయించారు. పైకప్పు వరకు పనులు పూర్తయిన తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కల్యాణ మండపం గురించి పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, వీఎంఆర్డీఏ నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో పైకప్పునకు రేకులు అమర్చారు. ఇతరత్రా చిన్నాచితకా పనులు పూర్తి చేశారు. కల్యాణ మండపాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం తాజాగా వీఎంఆర్‌డీఏ నుంచి మరో రూ.1.2 కోట్లు మంజూరు చేయించింది. ఈ నిధులతో కల్యాణ మండపానికి సెంట్రల్ ఏసీ, అత్యాధునిక ఎలివేషన్, విద్యుదీకరణ పనులు చేస్తారు. వేడుకలు నిర్వహించుకునే వారి సౌకర్యార్థం కుర్చీలు, వంట సామగ్రి సమకూరుస్తారు. వధూవరులు దుస్తులు మార్చుకోవడానికి రెండు గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తారు.