జిల్లా అభివృద్ధికి నిధులు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:28 AM
అనకాపల్లి జిల్లాలో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా వీఎంఆర్‌డీఏ నిధులు మంజూరు చేస్తుందని సంస్థ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ చెప్పారు. మంగళవారం స్థానిక వీఎంఆర్‌డీఏ జోనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకూ ప్రాధాన్యం
వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్
అనకాపల్లి టౌన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా వీఎంఆర్‌డీఏ నిధులు మంజూరు చేస్తుందని సంస్థ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ చెప్పారు. మంగళవారం స్థానిక వీఎంఆర్‌డీఏ జోనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనకాపల్లిలో రావు గోపాలరావు కళాకేంద్రాన్ని రూ.4.5 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, కొత్తూరు పంచాయతీ సాయినగర్ సమీపంలో రూ.5 కోట్లతో పర్యాటకుల కోసం అధునాతన పార్కును అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రామాపురం నల్లమారమ్మ ఆలయానికి సమీపంలో రూ.2.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు మూడు దశల్లో రూ.17.11 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎలమంచిలి మునిసిపాలిటీలో డ్రైనేజీ కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు. పాయకరావుపేటలో మెయిన్ రోడ్డు విస్తరణ పనులనున రూ.5.25 కోట్లతో చేపట్టాలమని, త్వరలో పూర్తవుతాయని ప్రణవ్‌గోపాల్ తెలిపారు. పెందుర్తి సమీపంలో వేపగుంట వద్ద రూ.5 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టామని, మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో రూ.కోటితో కల్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నదని, రూ.25 లక్షలతో నిర్మించిన పార్కు అందుబాటులోకి వచ్చిందన్నారు. చోడవరంలో రూ.కోటితో పార్కు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో అక్రమ లేఅవుట్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,, ఇప్పటికే విజిలెన్స్ బృందాలు అక్రమ లేఅవుట్‌లపై దృష్టి సారించాయని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నందున రాంబిల్లి నుంచి కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, కె.కోటపాడు మండలాల మీదుగా భోగాపురం విమానాశ్రయానికి సెమీ రింగు రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలో ఉందని వీఎంఆర్‌డీఏ చైర్మన్ చెప్పారు.