Share News

నిధులున్నా.. నిర్లక్ష్యం

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:45 AM

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు అన్న చందంగా తయారైంది నర్సీపట్నం- తుని ప్రధాన రహదారి పరిస్థితి. ఈ రోడ్డు అభివృద్ధికి శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిధులు మంజూరు చేయించినప్పటికీ... టెండర్‌ ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టడం లేదు. దీంతో నర్సీపట్నం- తుని రోడ్డులో పలుచోట్ల ఏర్పడిన గోతులతో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నిధులున్నా.. నిర్లక్ష్యం
నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఛిద్రమైన రహదారి

మొదలుకాని నర్సీపట్నం- తుని రోడ్డు అభివృద్ధి పనులు

రూ.7.2 కోట్లు మంజూరు చేయించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

గత ఏడాది డిసెంబరులో భూమి పూజ

ఎనిమిది నెలలుదాటినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

గోతులతో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు

నర్సీపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు అన్న చందంగా తయారైంది నర్సీపట్నం- తుని ప్రధాన రహదారి పరిస్థితి. ఈ రోడ్డు అభివృద్ధికి శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిధులు మంజూరు చేయించినప్పటికీ... టెండర్‌ ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టడం లేదు. దీంతో నర్సీపట్నం- తుని రోడ్డులో పలుచోట్ల ఏర్పడిన గోతులతో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నర్సీపట్నం- తుని ప్రధాన రహదారి నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో క్రమేపీ గోతులు ఏర్పడి ఛిద్రమైంది. అనకాపల్లి జిల్లా పరిధిలో నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం శృంగవరం వరకు రోడ్డుపై చాలాచోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. కనీసం గోతులను కూడా పూడ్చకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్నారు. శారదానగర్‌ నుంచి బలిఘట్టం ఊర్లోకి మలుపు తిరిగే మార్గంలో, బలిఘట్టం చెక్‌పోస్టు నుంచి తలుపుమ్మ గుడి వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవ తీసుకొని నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం శృంగవరం వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులకు రూ.7.2 కోట్లు మంజూరు చేయించారు. తరువాత అధికారులు టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. గత ఏడాది డిసెంబరులో రోడ్డు పనులు మొదలు పెట్టించడానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో భూమి పూజ చేయించారు. ఇది జరిగి ఎనిమిది నెలలు దాటినప్పటికీ కాంట్రాక్టర్‌ రోడ్డు పనులు మొదలు పెట్టలేదు. అగ్రిమెంట్‌ ప్రకారం నిర్ణీత గడువులోగా పనులు మొదలు పెట్టకపోతే టెండర్‌ను రద్దు చేసే అధికారం అధికారులకు వుంది. కానీ కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు ధరలు బాగా పెరిగిపోయాయని, రేట్లు తగ్గితే కాంట్రాక్టర్‌ పనులు మొదలు అంటున్నారు. ఆర్‌అండ్‌బీతో అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల/ తగ్గుదలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్‌ పనులు చేయాలి. కానీ నర్సీపట్నం- తుని రోడ్డు పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. వర్షం పడినప్పుడు గోతుల్లో నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:45 AM