Share News

గిరిజన రైతులకు సంపూర్ణ ప్రోత్సాహం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:00 AM

జిల్లాలో పీఎం డీడీకేవై కింద ఉద్యానవన, వ్యవసాయ రంగాల ప్రగతికి చేపడుతున్న చర్యలను కలెక్టర్‌ టి.నిషాంతి సమగ్రంగా వివరించారు. ప్రధానమంత్రి ధన్‌ ధాన్యకృషీ యోజనపై సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె హాజరయ్యారు.

గిరిజన రైతులకు సంపూర్ణ ప్రోత్సాహం
జాతీయ సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

జాతీయ సదస్సులో కలెక్టర్‌ నిషాంతి వెల్లడి

ఉద్యానవన, వ్యవసాయ రంగాల ప్రగతిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

పాడేరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం డీడీకేవై కింద ఉద్యానవన, వ్యవసాయ రంగాల ప్రగతికి చేపడుతున్న చర్యలను కలెక్టర్‌ టి.నిషాంతి సమగ్రంగా వివరించారు. ప్రధానమంత్రి ధన్‌ ధాన్యకృషీ యోజనపై సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల్లో పీఎం డీడీకేవై అమలు చేస్తున్న తీరుపై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో పీఎం డీడీకేవైలో ఉద్యానవన, వ్యవసాయ రంగాల ప్రగతిని కలెక్టర్‌ టి.నిషాంతి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలోని 11 మండలాల్లో 90.7 శాతం షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ఉన్నారని, సగటున ఏడాది వర్షపాతం 1300 మిల్లీమీటర్లు నమోదవుతున్నదని, 2 లక్షల 60 వేల ఎకరాల్లో కాఫీ పంట ఉందని పేర్కొన్నారు. అలాగే జిల్లాను గంజాయి రహితం చేసి, గిరిజన రైతులకు ఆదాయానిచ్చే పండ్ల మొక్కలను అందించి ప్రత్యామ్నాయ పంట సాగుకు ప్రోత్సాహిస్తున్నామని, రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలు, రాయితీపై యంత్ర పరికరాలు, విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే పంటల సాగుకు, భవిష్యత్తులో గిరిజన రైతులకు అధిక ఆదాయం వచ్చే లిచ్చీ, అవకాడో వంటి పంటలను ప్రోత్సహిస్తున్నామని, నాణ్యమైన పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సదుపాయాలపై దృష్టి సారిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో సహజ వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యానవన, వ్యవసాయం ద్వారా గిరిజనుల జీవనోపాధి మరింత మెరుగుపడేలా ప్రకృతి వ్యవసాయాన్ని సంపూర్ణంగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

Updated Date - Oct 13 , 2026 | 12:00 AM