అందాలు ఫుల్.. సౌకర్యాలు నిల్
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:29 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
లంబసింగి వచ్చి ఇబ్బంది పడుతున్న పర్యాటకులు
మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం లేక అవస్థలు
ప్రారంభమైన పర్యాటక సీజన్
పెరిగిన సందర్శకులు
పట్టించుకోని అధికారులు
చింతపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏటా పర్యాటక సీజన్ ప్రారంభానికి ముందు లంబసింగిలో రక్షిత మంచినీరు, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు చేస్తున్నప్పటికి ఎనిమిదేళ్లగా కార్యరూపం దాల్చడం లేదు.
ఆంధ్రకశ్మీర్గా గుర్తింపు పొందిన లంబసింగికి ప్రతీ ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. శని, ఆదివారాలు వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ సీజన్లో లంబసింగి పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా లంబసింగి జంక్షన్, లంబసింగి, రాజుపాకలు, భీమనాపల్లి, తాజంగి జలాశయం, చెరువులవేనం వద్ద పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుంది. లంబసింగి మంచు అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన అనుభూతిని పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సందర్శనీయ ప్రాంతాలైన లంబసింగి జంక్షన్, లంబసింగి, భీమనాపల్లి, తాజంగి జలాశయం ప్రాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు లేవు. చెరువులవేనం వ్యూపాయింట్లో ఆరు మరుగుదొడ్లు ఉన్నప్పటికి నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పర్యాటక ప్రాంతంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న లంబసింగి, తాజంగి ప్రాంతంలో సందర్శకులకు కనీస సదుపాయాలు కల్పించడంలో ఐటీడీఏ, పర్యాటకశాఖ పూర్తిగా విఫలమైంది. లంబసింగిలో బయో టాయిలెట్లు, ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకటనలు చేసి మిన్నకున్నది. కూటమి ప్రభుత్వంలోనైనా మరుగుదొడ్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.
పర్యాటకులకు తప్పని అవస్థలు
లంబసింగికి పర్యాటక సీజన్లో రోజూ వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. సందర్శనీయ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో మల విసర్జనకు సమీపంలోని తోటలు, తుప్పల్లోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మైదాన ప్రాంతాల నుంచి వేకువజామున 4 గంటలకే పర్యాటకులు లంబసింగి చేరుకుని సాయంత్రం వరకు పరిసర ప్రాంతాలను సందర్శిస్తారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మల, మూత్ర విసర్జనకు వెళ్లకుండా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకటనలకే పరిమితం
లంబసింగి- తాజంగి మార్గంలో, చెరువులవేనంకి వెళ్లే మార్గంలో పలు చోట్ల పర్యాటకుల సౌకర్యార్థం బయోటాయిలెట్లు, ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు ఎనిమిదేళ్లగా సీజన్ ప్రారంభానికి ముందు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. ప్రజా మరుగుదొడ్లు నిర్మించి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్, ఐటీడీఏ పీవోలు గతంలో ప్రకటించినప్పటికి ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. లంబసింగి సందర్శించిన పర్యాటకులు కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి సందర్శించిన పర్యాటకులు మరోసారి కుటుంబాలతో సందర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపఽథ్యంలో జిల్లా అధికారులు, పర్యాటకశాఖ స్పందించి లంబసింగి జంక్షన్, లంబసింగి, భీమనాపల్లి, తాజంగి జలాశయం, రాజుపాకలు, చెరువులవేనం ప్రాంతాల్లో మరుగుదొడ్లు, బయోటాయిలెట్స్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుంది.
పెరిగిపోతున్న పారిశుధ్య సమస్య
లంబసింగి, తాజంగి పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య భారీగా పెరిగిపోతున్నది. లంబసింగి-తాజంగి, భీమనపల్లి-చెరువులవేనం మార్గంలో ఎక్కడా చెత్తబుట్టలు లేవు. పర్యాటకులు చెత్తను ఎక్కడవేయాలో తెలియక ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు, పంట పొలాలు, కాఫీ తోటల్లో ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు పేరుకుపోతున్నాయి. ఈ చెత్తను ఎప్పడికప్పుడు తొలగించకపోవడం వల్ల సందర్శక ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య పెరిగిపోతున్నది.