విశాఖలో ఫుల్... శివారులో నిల్!
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:12 AM
పెట్రోల్, డీజిల్ సరఫరాపై వస్తున్న వదంతులతో వినియోగదారులల్లో గందరగోళం ఏర్పడింది.
పెట్రోల్, డీజిల్ కొరతతో మూతపడుతున్న బంకులు
మధురవాడ, గాజువాక, కొమ్మాదిలో నో స్టాక్ బోర్డులు
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
పెట్రోల్, డీజిల్ సరఫరాపై వస్తున్న వదంతులతో వినియోగదారులల్లో గందరగోళం ఏర్పడింది. దీనికితోడు ఆయిల్ సరఫరాలో కంపెనీలు క్రెడిట్ విధానానికి స్వప్తి చెప్పడంతో బంకుల యజమానులకు కావాల్సినంత సరుకులభించడంలేదు. దీంతో వాహనదారులు అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంకుల్లో నిల్వలు నిండుకుని శివారు ప్రాంతాల్లో మూసివేస్తున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా నగర శివారు ప్రాంతాల్లో అందుకు భిన్నమైన పరిస్థతులున్నాయి. ఆదివారం రాత్రి కొమ్మాదిలో పెట్రోల్ కోసం వాహనదారులు క్యూకట్టారు. మరోచోట బంకు పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో చమురు నిల్వలపై జిల్లా యంత్రాంగం ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షించింది. జిల్లాలో 120 పెట్రోల్‌బంకులు, 113 డీజిల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఆదివారం నాటికి 1,894 కిలోలీటర్ల పెట్రోల్, 2,009 కిలో లీటర్ల డీజిల్ స్టాకు ఉందని జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. జిల్లాలో పుష్కలంగా చమురు నిల్వలున్నాయని, వాహనదారులు ఆందోళన చెందవద్దని కోరారు. అవసరానికి మించి కొనుగోళ్లు చేయవద్దని సూచించారు. చమురు నిల్వల కోసం జిల్లాస్థాయిలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశామని, అవసరమైతే బంకుల వద్ద పోలీస్, రెవెన్యూ సిబ్బందిని నియమిస్తామన్నారు. సరఫరా మరింత పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీల మార్కెటింగ్ విభాగాలు హామీ ఇచ్చాయని, పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందన్నారు.జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు ఆదివారం కొమ్మాది, మఽధురవాడ, భీమిలి ప్రాంతాల్లో బంకులు సందర్శించి నిల్వలు పరిశీలించారు.