Share News

ఆస్పత్రులకు ఇంధనం

ABN , Publish Date - May 21 , 2026 | 12:51 AM

బిల్లుల భారం తగ్గించుకునేందుకు నగర పరిధిలోని బోధనాస్పత్రులు సౌర విద్యుదుత్పత్తి బాట పట్టాయి. ఈ మేరకు 2018లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో సోలార్‌ ప్యానల్స్‌ను ఒక ప్రైవేటు సంస్థ 2018లో ఏర్పాటుచేయించింది. అందుకయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించింది. అందుకు ప్రతిగా ఆయా ఆస్పత్రుల నుంచి యూనిట్‌కు రూ.4 చొప్పున సదరు సంస్థ తీసుకుంటోంది. సాధారణంగా ఈపీడీసీఎల్‌ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు అవుతోంది. అదే ఆ సంస్థ నాలుగు రూపాయలకు అందిస్తున్నట్టు లెక్క. ఈ విధంగా ఆయా ఆస్పత్రులు వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చు తగ్గుతోంది.

ఆస్పత్రులకు ఇంధనం
కేజీహెచ్‌, విమ్స్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్స్‌

సోలార్‌ విద్యుదుత్పత్తితో వ్యయ నియంత్రణ

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం

నగరంలోని బోధనాస్పత్రులన్నింటిపైనా ప్యానల్స్‌ ఏర్పాటు

నెలకు ఒక్కో ఆస్పత్రికి రూ.50 వేల నుంచి

రూ.2 లక్షల వరకు బిల్లు ఆదా

విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):

బిల్లుల భారం తగ్గించుకునేందుకు నగర పరిధిలోని బోధనాస్పత్రులు సౌర విద్యుదుత్పత్తి బాట పట్టాయి. ఈ మేరకు 2018లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో సోలార్‌ ప్యానల్స్‌ను ఒక ప్రైవేటు సంస్థ 2018లో ఏర్పాటుచేయించింది. అందుకయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించింది. అందుకు ప్రతిగా ఆయా ఆస్పత్రుల నుంచి యూనిట్‌కు రూ.4 చొప్పున సదరు సంస్థ తీసుకుంటోంది. సాధారణంగా ఈపీడీసీఎల్‌ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు అవుతోంది. అదే ఆ సంస్థ నాలుగు రూపాయలకు అందిస్తున్నట్టు లెక్క. ఈ విధంగా ఆయా ఆస్పత్రులు వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు నాలుగు నుంచి ఐదు రూపాయల వరకు ఖర్చు తగ్గుతోంది.

లక్షల రూపాయల ఆదా..

ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలోని విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో 753 ప్యానల్స్‌ను ఏర్పాటుచేశారు. వాటి ద్వారా నెలకు 34 వేలకుపైగా యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఆస్పత్రికి ప్రతినెలా విద్యుత్‌ బిల్లు రూ.2.5 లక్షల వరకు వస్తోంది. ఇందులో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వల్ల లక్ష రూపాయల వరకు ఆదా అవుతోంది. అలాగే, ఘోష ఆస్పత్రిలో 130 కిలోవాట్‌ సామర్థ్యంతో ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానల్స్‌ వల్ల 20 వేలకుపైగా యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. ప్రతినెలా ఆస్పత్రికి రూ.1.8 లక్షలు నుంచి రూ.2.2 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు జనరేట్‌ అవుతుండగా, సోలార్‌ విద్యుత్‌ ఉత్పిత్తితో ఈ బిల్లులో రూ.60 వేల నుంచి రూ.80 వేలు వరకు మిగులుతోంది. ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో 250 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుచేయగా, వాటి ద్వారా ఆస్పత్రికి వచ్చే బిద్యుత్‌ బిల్లులో దాదాపు 40 శాతం మేర ఆదా అవుతున్నట్టు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. నెలకు రూ.1.8 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు జనరేట్‌ అవుతుండగా, రూ.80 వేల వరకు బిల్లు వ్యయం తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మానసిక వైద్యశాలలో 110 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన మాడ్యుల్స్‌ ఏర్పాటు ద్వారా ప్రతినెలా 20 వేలకుపైగా యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. ఆస్పత్రికి నెలకు రూ.2.1 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు వస్తుండగా, రూ.70 వేల వరకు సోలార్‌ విద్యుత్‌ బిల్లు ఖర్చు తగ్గినట్టు ఆస్పత్రి అధికారులు తెలిపారు. కొద్దిరోజుల కిందట ఫ్యామిలీ వార్డు వద్ద కూడా 50 కిలోవాట్ల సామర్థ్యంతో మరికొన్ని ప్యానల్స్‌ ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో మరింత విద్యుత్‌ ఖర్చు ఆదా అవుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేజీహెచ్‌లో సుమారు 350 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రతినెలా ఆస్పత్రికి రూ.5 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు ఆదా అవుతోంది. ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌, సూపర్‌ స్పెషాలిటీ, ఆర్థో విభాగాలపైన సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈఎన్‌టీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రిలోనూ 100 కిలోవాట్లకుపైగా సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుచేశారు. ఈ రెండు ఆస్పత్రుల్లోనూ నెలకు రూ.50 వేలు నుంచి రూ.70 వేలు చొప్పున బిల్లులో ఆదా అవుతున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Updated Date - May 21 , 2026 | 12:51 AM