Share News

పరిశ్రమలపై ఇంధన భారం

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:41 AM

పరిశ్రమలకు డీజిల్‌ (ఐఎన్‌సీ డీజిల్‌) ధరను ఆయిల్‌ కంపెనీలు పెంచుకుంటూ పోతున్నాయి. అందువల్లే సాధారణ డీజిల్‌కు డిమాండ్‌ ఏర్పడి, కొరత వస్తోంది. ఈ విషయాన్ని కంపెనీలు వెల్లడించకుండా మౌనం వహిస్తున్నాయి. సరిపడనంత నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సమస్య మూలాల్లోకి ఎవరూ వెళ్లడం లేదు.

పరిశ్రమలపై  ఇంధన భారం

వాటికి విక్రయించే డీజిల్‌ ధర

రెండు నెలల్లో 50 శాతం పెంపు

పరిశ్రమల డీజిల్‌ ధర లీటరు రూ.149

సాధారణ డీజిల్‌ రేటు లీటరు 96.24 మాత్రమే

ఈ వ్యత్యాసమే కృత్రిమ డిమాండ్‌కు కారణం

రేపు మరో రూ.6 పెంపునకు ప్రతిపాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పరిశ్రమలకు డీజిల్‌ (ఐఎన్‌సీ డీజిల్‌) ధరను ఆయిల్‌ కంపెనీలు పెంచుకుంటూ పోతున్నాయి. అందువల్లే సాధారణ డీజిల్‌కు డిమాండ్‌ ఏర్పడి, కొరత వస్తోంది. ఈ విషయాన్ని కంపెనీలు వెల్లడించకుండా మౌనం వహిస్తున్నాయి. సరిపడనంత నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సమస్య మూలాల్లోకి ఎవరూ వెళ్లడం లేదు.

యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకే విదేశాల నుంచి వచ్చే ఆయిల్‌ నౌకలు ఆగిపోవడంతో ఇక్కడి కంపెనీలు అప్రమత్తమయ్యాయి. సాధారణ ప్రజలు ఉపయోగించే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించవని గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమలపై భారం మోపాయి. గత నెల అంటే మార్చి 20వ తేదీన ఆ డీజిల్‌ ధర 25 శాతం పెంచాయి. అప్పుడు ఐఎన్‌సీ డీజిల్‌ ధర లీటరు రూ.96.24 ఉండేది. దానిని రూ.121.42కు పెంచాయి. సాధారణ వాహనాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వాహనాలు, ఫిషింగ్‌ బోట్లు, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్‌కు ఈ ధరను వర్తింపజేశారు. అప్పటి నుంచి సాధారణ డీజిల్‌ పక్కదారి పట్టడం మొదలైంది. బంకులకు వచ్చే డీజిల్‌ను కొందరు పరిశ్రమలకు దొడ్డిదారిన అమ్మడం ప్రారంభించారు. లీటరుకు అధమంగా రూ.10 నుంచి రూ.15 లాభం వేసుకున్నారు. ఈ విషయం గమనించిన కంపెనీలు షరతులు పెట్టాయి. ఎవరికీ 300 లీటర్లకు మించి ఇవ్వవద్దని చెప్పాయి. ఆ తరువాత 100 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వొద్దని కోరాయి. ఐఎన్‌సీ డీజిల్‌ ధరను ఏప్రిల్‌ నెల మధ్యలో మరోసారి పెంచారు. దీంతో లీటరు రూ.149కు చేరింది. మార్చి 20వ తేదీకి ముందు ధరకు, ఇప్పటిధరకు మధ్య వ్యత్యాసం రూ.51. అంటే అప్పటి ధరపై 50 శాతం వరకు రేటు పెరిగింది. సాధారణ డీజిల్‌ ధర మాత్రం అలాగే ఉంది. దీంతో ఐఎన్‌సీ డీజిల్‌ వాడేవారు బంకుల యజమానులతో కుమ్మక్కై బ్లాకులో కొనుక్కుంటున్నారు. ఇరువర్గాలు లాభపడుతున్నాయి. ఈ విషయం గుర్తించిన ఆయిల్‌ కంపెనీలు బంకులకు డీజిల్‌ సరఫరా తగ్గించేశాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్‌ నెలాఖరులతో ముగిసిపోతున్నందున ఆ వెంటనే అయిల్‌ రేట్ల పెంపునకు కేంద్రమే అనుమతి ఇస్తుందని ప్రచారం జరగడంతో కంపెనీలు నిల్వలు పెంచుకుంటూ, సరఫరా తగ్గించేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డీజిల్‌ కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా నెలకొన్న పరిస్థితులు, బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతుండడం చూసి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో బుధవారం పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చింది. అయితే ఐఎన్‌సీ డీజిల్‌ ధర గురువారం లీటరుకు మరో ఆరు రూపాయలు పెరుగుతుందని బంకుల యజమానులు చెబుతున్నారు. అప్పుడు ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.

Updated Date - Apr 30 , 2026 | 01:41 AM