ఫ్రై డే
ABN , Publish Date - May 23 , 2026 | 12:25 AM
భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాడ్పులతో జనం విలవిలలాడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ మండిపోతున్నది. పది గంటల తరువాత జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
భానుడి ప్రతాపంతో జనం విలవిల
ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాడ్పులు
దేవరాపల్లిలో 44.7 డిగ్రీలు నమోదు
అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాడ్పులతో జనం విలవిలలాడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ మండిపోతున్నది. పది గంటల తరువాత జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు వడగాడ్పులు వీస్తున్నాయి. వేడికితోడు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న మూడు రోజులు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేవారు గొడుగులు, టోపీలు వినియోగించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వెంట వుంచుకోవాలని, దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలని సూచిస్తున్నారు. కాడా శుక్రవారం కూడా దేవరాపల్లి మండలంలో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారంతోపోలిస్తే పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు స్పల్పంగా తగ్గాయి. మాకవరపాలెంలో 43.7, బుచ్చెయ్యపేటలో 41.3, కె.కోటపాడులో 40.9, మాడుగులలో 41.9, నర్సీపట్నంలో 41.5, నాతవరంలో 41.1, రావికమతంలో 40.9, అనకాపల్లిలో 37.5, అచ్యుతాపురంలో 36.4, చీడికాడలో 38.3, చోడవరంలో 40, గొలుగొండలో 39.9, కశింకోటలో 39.5, కోటవురట్లలో 37.6, మునగపాకలో 38.3, నక్కపల్లిలో 38.5, పరవాడలో 35.6, పాయకరావుపేటలో 39.6, రాంబిల్లిలో 36.7, రోలుగుంటలో 39.9, ఎస్.రాయవరంలో 38.6, సబ్బవరంలో 38.2, ఎలమంచిలిలో 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.