పల్లె నుంచి ప్రపంచస్థాయికి..
ABN , Publish Date - May 29 , 2026 | 12:33 AM
నక్కపల్లిలోని బీఎస్ హాకీ క్లబ్ ద్వారా తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులు ‘ఇంతింతై వటుడింతై’.. అన్నట్టుగా పల్లె నుంచి ప్రపంచస్థాయికి దూసుకుపోతున్నారు. పదేళ్ల క్రితం పది మందితో ప్రారంభమైన ఈ హాకీ క్లబ్‌లో ఇప్పుడు వంద మందికిపైగా క్రీడాకారులు వున్నారు. హాకీ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్నారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా కింద రక్షణ రంగంలో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.
హాకీ పోటీల్లో సత్తా చాటుతున్న నక్కపల్లి క్రీడాకారులు
అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
జపాన్‌లో జరిగే ఆసియా కప్ హాకీ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానం
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధిస్తున్న బీఎస్ హాకీ క్లబ్ క్రీడాకారులు
పలువురికి స్పోర్ట్స్ స్కూళల్లో సీట్లు
నక్కపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి):
నక్కపల్లిలోని బీఎస్ హాకీ క్లబ్ ద్వారా తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులు ‘ఇంతింతై వటుడింతై’.. అన్నట్టుగా పల్లె నుంచి ప్రపంచస్థాయికి దూసుకుపోతున్నారు. పదేళ్ల క్రితం పది మందితో ప్రారంభమైన ఈ హాకీ క్లబ్‌లో ఇప్పుడు వంద మందికిపైగా క్రీడాకారులు వున్నారు. హాకీ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్నారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా కింద రక్షణ రంగంలో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.
నక్కపల్లి ప్రాంతవాసులకు దశాబ్దం క్రితం వరకు హాకీ క్రీడపై పెద్దగా అవగాహన లేదు. విద్యార్థులు, యువకులు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు మాత్రమే ఆడేవారు. ఇటువంటి తరుణంలో పదేళ్ల క్రితం సీనియర్ హాకీ క్రీడాకారుడు బలిరెడ్డి సూరిబాబు నక్కపల్లి విద్యార్థులు, యువతకు హాకీ క్రీడను పరిచయం చేశారు. నీ వెంట మేమున్నామంటూ మరికొందరు అండగా నిలిచారు. హాకీ క్రీడాకారుడిగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన సూరిబాబు.. పది మందితో ‘బీఎస్ హాకీ క్లబ్’ను స్థాపించారు. తొలుత 10 మందితో ప్రారంభమైన హాకీ క్లబ్‌లో ఇప్పుడు క్రీడాకారుల సంఖ్య వంద దాటింది. ఇక్కడ హాకీలో తర్ఫీదు పొందుతున్న వారిలో పలువురు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీల్లో సత్తాచాటుతున్నారు. స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు. పది మందికిపై క్రీడాకారులు ఆర్మీలో, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు పొందారు. తాజాగా అంతర్జాతీయ హాకీ పోటీల్లో భారత దేశం తరపున పాల్గొనే జట్టులో నక్కపల్లి క్రీడాకారిణికి చోటు లభించింది. ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జపాన్‌లో జరిగే ఆసియా కప్ అండర్-18 విభాగం పోటీల్లో నక్కపల్లి హాకీ క్లబ్ క్రీడాకారిణి నమ్మి గీతాశ్రీ ఆడనున్నది. ఈమె రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న గీతాశ్రీ ఈ నెల 30న మలేసియా, 31న దక్షిణ కొరియా, జూన్ 2న సింగపూర్ జట్లతో తలపడే ఇండియా జట్టులో ఆడనున్నది.
గీతాశ్రీ సత్తా చాటుతుంది
బలిరెడ్డి సూరిబాబు, హాకీ క్లబ్ వ్యవస్థాపకులు
నక్కపల్లి హాకీ క్లబ్ క్రీడాకారులు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఆసియా కప్‌లో ఆడాలన్నదే నా జీవితాశయం. ఇన్నాళ్లకు నమ్మి గీతాశ్రీ ఈ ఆశయాన్ని నెరవేరుస్తున్నది. అండర్-18 విభాగంలో జపాన్‌లో జరగనున్న ఆసియా కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానం లభించడం చాలా ఆనందంగా వుంది. ఈ పోటీల్లో గీతాశ్రీ సత్తా చాటుతుందన్న నమ్మకం వుంది. రానున్న కాలంలో మరికొంతమంది క్రీడాకారులు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా చేయాలన్నదే మా సంకల్పం.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది
కొల్నాటి దుర్గా ప్రసాద్, ఆర్మీ జవాను
క్రీడల్లో ప్రతిభ చూపితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తుందని తెలుసుకొని ఏడేళ్ల కిందట నక్కపల్లి హాకీ క్లబ్‌లో చేరి నిరంతరం సాధన చేశాను. కోచ్‌ల సూచనలతో మెలకువలు నేర్చుకున్నాను. హాకీ పోటీల్లో రాణించడంతో స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో సిపాయి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కోల్‌కతాలో విధులు నిర్వహిస్తున్నాను.