స్వాతంత్ర్యోద్యమ వీరుడు పండు పడాల్
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:20 AM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో బోనంగి పండు పడాల్ కీలక పాత్ర పోషించారు. అల్లూరితో కలిసి సాయుధ పోరాటం చేశారు.
అల్లూరికి ముఖ్య అనుచరుడు
సీతారామరాజుతో కలిసి సాయుధ పోరాటం, పోలీసు స్టేషన్లపై దాడి
అండమాన్‌లో సుదీర్ఘ కాలం జైలు జీవితం
నేడు బోనంగి పండు పడాల్ జయంతి సందర్భంగా...
చింతపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో బోనంగి పండు పడాల్ కీలక పాత్ర పోషించారు. అల్లూరితో కలిసి సాయుధ పోరాటం చేశారు. అల్లూరి మరణం అనంతరం బ్రిటీష్ పోలీసులకు పట్టుబడి సుదీర్ఘ కాలం ఆయన అండమాన్ జైలులో గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక అక్కడే స్థిరపడిపోయారు. కాగా ఏటా ఆగస్టు 13న పండు పడాల్ స్వగ్రామం గొందిపాకలులో కుటుంబ సభ్యులు, స్థానిక ఆదివాసీలు ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది అధికారులు అధికారికంగా నిర్వహించినప్పటికీ ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు.
అల్లూరి సీతారామరాజు అనుచరుల్లో గాం గంటన్నదొర, మల్లుదొర, గోకిరి ఎర్రేసు తరువాత స్థానం పండు పడాల్‌ది. ఆయన స్వగ్రామం చింతపల్లి మండలం గొందిపాకలు. 30 ఏళ్ల వయస్సులో అదే గ్రామానికి చెందిన లింగయమ్మతో ఆయన వివాహమైంది. అప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా బ్రిటీష్ పాలకుల దురాగతాలు పెచ్చుమీరిపోయాయి. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు మన్యంలో అడుగుపెట్టి సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి పోరాటానికి ఆకర్షితుడైన పండు పడాల్ ఉద్యమంలో చేరాడు. సాయుధ పోరాటానికి అల్లూరి వెంట వెళ్లిన సమయంలో ఆయన భార్య ఎనిమిది నెలల గర్భిణి.
సాయుధ పోరాటంలో పండు పడాల్ పాత్ర
సీతారామరాజుతో కలిసి చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం పోలీసు స్టేషన్ల దాడుల్లో పండు పడాల్ పాల్గొన్నారు. దామనాపల్లి, పెదవలస యుద్ధంలో అల్లూరితో పండు పడాల్ బ్రిటీష్ పాలకులపై మెరుపు దాడి చేసి ఇద్దరు అధికారులను మట్టుబెట్టారు. ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటీష్ సైనికాధికారులు హైటర్, క్లవర్ట్‌లను అంతమొందించిన దాడిలో పండు పడాల్ ప్రధాన భూమిక పోషించారు. దీంతో బ్రిటీష్ పోలీసుల హిట్‌లిస్ట్‌లో పండు పడాల్ చేరాడు. నాటి నుంచి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆయన అనుచరుల్లో ఒకరైన పండు పడాల్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. దీంతో పండు పడాల్ అజ్ఞాత జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే ఆయన కుటుంబ సభ్యులను బ్రిటీష్ పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆయన సోదరి రామయమ్మ ఇంటికి భోజనానికి పిలిచి పండాల్‌ను పోలీసులకు పట్టించింది. బ్రిటీష్ పోలీసులకు పట్టుబడిన పడాల్‌కు విశాఖపట్నం సెషన్స్ కోర్టు 1925 మే 11న మరణశిక్ష విధించింది. ఈ శిక్షను మళ్లీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రాజమండ్రి, తిరుచురాపల్లి జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. 1926లో పడాల్‌ను అండమాన్‌లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అండమాన్ సెల్యూలార్ జైలులో శిక్ష అనుభవించారు.
అండమాన్‌లో స్థిర నివాసం
జైలు నుంచి విడుదలైన పండు పడాల్ అండన్‌మాన్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తన భార్య లింగాయమ్మను అండమాన్ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్‌లో పార్వతితో వివాహం కాగా, వారికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు జన్మించారు. 1974 ఫిబ్రవరి 11న పండు పడాల్ అండన్‌మాన్‌లో మరణించారు. 1973లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పడాల్ జీవిత చరిత్రను సేకరించింది. కాగా అండమాన్‌లో పండు పడాల్ కుటుంబ సభ్యులు తండ్రి స్వగ్రామం గొందిపాకలను వెతుక్కుంటూ వచ్చి స్థానిక కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన పోరాట పటిమకు స్ఫూర్తిగా పడాల్ కుమారుడు శివరాజు పడాల్ 2012 ఫిబ్రవరి 29న గొందిపాకలులో పండు పడాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది స్థానిక గిరిజనులు ఆయన విగ్రహానికి నివాళి అర్పించి ఆయన పోరాట పటిమను నెమరువేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 2025లో ప్రభుత్వ ఆదేశాలతో నాటి కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్, టీడీపీ నియోజక వర్గం ఇన్‌చార్జి అధికారికంగా గొందిపాకలు గ్రామంలో పండు పడాల్ జయంతిని నిర్వహించారు. ఈ ఏడాది పండు పడాల్ జయంతి కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే స్థానిక గిరిజనులు జయంతిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మ్యూజియంలో పండు పడాల్ విగ్రహం
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంలో పండు పడాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పండు పడాల్ చరిత్ర, అల్లూరితో సాగించిన పోరాటం, జైలు జీవితం, కుటుంబ సభ్యుల వివరాల చరిత్రను మ్యూజియంలో పొందుపరిచేందుకు గిరిజన సంక్షేమశాఖ, కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.