ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:36 AM
రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నిరుపేదలకు అవకాశం
ఒకటో తరగతిలో నాలుగో వంతు కేటాయింపు
అంతా లాటరీ ద్వారానే...
వచ్చేనెల 10వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో 650 ప్రైవేటు పాఠశాలలు
అందుబాటులో ఆరు వేలకుపైగా సీట్లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):
రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యాహక్కు చట్టం-2009 సెక్షన్ 12(1) సి ప్రకారం పేద వర్గాలకు చెందిన పిల్లలకు ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలి. ఇందుకోసం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందగోరే బాలుడు/బాలిక వయస్సు సీబీఎస్‌ఈ సిలబస్ అయితే 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య జన్మించి ఐదేళ్లు నిండాలి. రాష్ట్ర సిలబస్‌లో అయితే 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 తేదీ మధ్య జన్మించి ఐదేళ్లు నిండి ఉండాలి. పిల్లల కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.44 లక్షలలోపు, బియ్యం కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఉన్న ఇంటి అడ్రస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం బాలబాలికల తల్లిదండ్రులు నివసించే ఇంటికి సమీపంలో ఉన్న సచివాలయ పరిధిలో ఉన్న పాఠశాలల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కిలోమీటరు నుంచి ఐదు కి.మీ. పరిధిలో గల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. మర్రిపాలెంలో నివసించే బాలబాలికల కోసం దగ్గర విశాఖ వ్యాలీ స్కూలుకు దరఖాస్తు చేసుకోవచ్చుగానీ తొలుత సదరు స్కూలుకు దగ్గరలో ఉన్న పిల్లలకు సీట్లు కేటాయించిన తరువాత మిగిలితే అవకాశం ఇస్తారు. ఇంకా సీటు కేటాయించే సమయంలో తండ్రి కులం మాత్రం ప్రామాణికంగా తీసుకుంటారు. వచ్చే నెల 17వ తేదీన సచివాలయాల్లో ఉన్న డేటా ప్రకారం దరఖాస్తుదారుల అర్హత నిర్ధారిస్తారు. అనంతరం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా 25వ తేదీన తొలివిడత లాటరీ తీస్తారు. దీని ప్రకారం సీట్లు పొందిన బాలబాలికలు వచ్చే నెల 26 నుంచి ఏప్రిల్ ఏడో తేదీలోగా ఆయా పాఠశాలల్లో ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఆ తరువాత మిగిలిన సీట్లకు ఏప్రిల్ 12న రెండో విడత లాటరీ తీస్తారు. వీరు ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీలోగా ప్రవేశాలు పొందాలి.
జిల్లాలో ఆరు వేలకుపైగా సీట్లు
విశాఖ జిల్లాలో 650 ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో సుమారు 25 వేల సీట్లు ఉన్నాయి. వాటిల్లో నాలుగో వంతు అంటే ఆరు వేల సీట్లు వరకూ ఉచితంగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు కేటాయించే అవకాశం ఉంది. గత ఏడాది జిల్లాలో 6,143 మందికి సీట్లు కేటాయించారు. అయితే పలు కారణాల వల్ల 2,724 మంది అర్హత కోల్పోగా, 3,419 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. అందువల్ల దరఖాస్తు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తాము నివసించే ప్రాంతంలోని సచివాలయానికి దగ్గరలో ఉన్న పాఠశాలలో సీటు కోసమే దరఖాస్తు చేయాలి. ఒకవేళ సదరు స్కూలు నచ్చకపోతే దరఖాస్తులో దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు. ఒకసారి లాటరీలో సీటు పొందిన తరువాత మరో పాఠశాలలో సీటు లభ్యం కాదు. ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసేవారంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చంద్రశేఖర్‌రావు సూచించారు.