Share News

ఉచిత వెసులుబాటుకు తూట్లు

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:13 AM

ఇళ్ల నిర్మాణం కోసం స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఎడ్లబళ్లతో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును పలువురు అక్రమార్కులు వ్యాపారంగా మార్చుకున్నారు. నదుల్లో నుంచి ఇసుకను తవ్వి, ట్రాక్టర్లతో రవాణా చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో తమకు సంబంధం లేదని గనుల శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా వుంది.

ఉచిత వెసులుబాటుకు తూట్లు
సీతానగరం వద్ద ట్రాక్టర్లలోకి ఇసుకను లోడింగ్‌ చేస్తున్న కూలీలు

శారదా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు

గ్రామాభివృద్ధి పేరుతో వేలం పాటలు

ఎడ్లబళ్లతో నదిలో నుంచి ఒడ్డుకు ఇసుక చేరవేత

ట్రాక్టర్లతో తరలింపు

పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు

కొత్తూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణం కోసం స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఎడ్లబళ్లతో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును పలువురు అక్రమార్కులు వ్యాపారంగా మార్చుకున్నారు. నదుల్లో నుంచి ఇసుకను తవ్వి, ట్రాక్టర్లతో రవాణా చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో తమకు సంబంధం లేదని గనుల శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా వుంది.

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం సమీపంలోని నదులు, వాగులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తవ్వి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇసుక అవసరమైన వారు సమీపంలోని సచివాలయంలో సంప్రదించి, ఇంటి నిర్మాణం వివరాలు, ఎంత మేరకు ఇసుక అవసరమో తెలియపరిచి అనుమతి పత్రం తీసుకోవాలి. దీనిని జారీ చేసిన 24 గంటల్లో నిబంధనల మేరకు ఇసుకను తవ్వి తీసుకెళ్లాల్సి వుంటుంది. మనుషులతో మాత్రమే ఇసుక తవ్వకాలు జరిపి, ఎడ్లబళ్లతో తీసుకెళ్లాలి. ఈ వెసులుబాటును ఇసుక అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అనకాపల్లి మండలం సీతానగరం, వెంకుపాలెం, సత్యనారాయణపురం, మూలపేట గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒక్కటయ్యారు. గ్రామాభివృద్ధి పేరుతో అనధికారికంగా ఇసుక వేలం పాటలు నిర్వహించారు. వెంకుపాలెంలో రూ.4 లక్షలు, సీతానగరంలో రూ.9 లక్షలకు పాడుకున్నట్టు తెలిసింది. వీరు ఎడ్లబళ్ల వారితో నదిలో ఇసుక తవ్వకాలు జరిపిస్తున్నారు. ఇసుకను తీరానికి చేర్చి కుప్పలుగా పోయిస్తున్నారు. సుమారు ట్రాక్టర్‌ లోడు ఇసుకకు రూ.1,100 చెల్లిస్తున్నారు. గ్రామాల్లో ట్రాక్టర్లు వున్న కొంతమంది ఇసుక రవాణా చేస్తున్నారు. వీరు ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.500 చొప్పున వేలంపాటదారులకు చెల్లించి, కూలీలతో లోడింగ్‌ చేయించుకొని తీసుకెళుతున్నారు. భవన నిర్మాణదారులకు ట్రాక్టర్‌ ఇసుక రూ.3,500కు అమ్ముతున్నారు. కాగా శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై తహశీల్దారు జి.ఆనందరావును వివరణగా కోరగా... సంబంధిత వీఆర్వోలను అక్కడకు పంపించి పరిశీలిస్తానని బదులిచ్చారు. మైన్స్‌ ఆర్‌ఐ శ్రీనివాసరావు వివరణ కోరగా.. నదిలో ఇసుక తవ్వకాలతో తమకు సంబంధం లేదని, అంతా రెవెన్యూ అధికారులు చూసుకుంటారని చెప్పారు.

Updated Date - Apr 25 , 2026 | 01:13 AM