టీచర్ పోస్టు ఇప్పిస్తానని మోసం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:42 AM
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సీఎం పేషీలో పెద్దవారితో పరిచయాలు ఉన్నట్టు మాయమాటలు
సీఎం తనతో మాట్లాడినట్టు నకిలీ ఆడియో క్లిప్పింగ్
నిజమేనని నమ్మి రూ.12.13 లక్షలు సమర్పించుకున్న రోలుగుంటకు చెందిన భార్యాభర్తలు
ఉద్యోగం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్టు
అనకాపల్లి రూరల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోలుగుంట మండలానికి చెందిన ఒక మహిళ డీఎస్సీ (ఉపాధ్యాయ పోస్టుల భర్తీ) పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన యరగొర్ల శ్రీను అనే వ్యక్తి, గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె భర్తకు పరిచయమయ్యాడు. తనకు సీఎం కార్యాలయంలో పెద్దవారితో పరిచయాలు ఉన్నాయని, రూ.15 లక్షలు ఇస్తే ఎస్‌జీటీ పోస్టు ఇప్పిస్తానని చెప్పాడు. అతనికి నమ్మకం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనతో మాట్లాడుతున్నట్టు రూపొందించిన ఒక నకిలీ ఆడియో క్లిపింగును పంపాడు. మరింత నమ్మకం కలిగించేందుకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన పీఏ భార్గవ్ చౌదరి మాట్లాడుతున్నట్టు మరో వ్యక్తితో కాన్ఫరెన్స్ కాల్‌లో సదరు మహిళ, ఆమె భర్తతో మాట్లాడించాడు. దీంతో వారికి నమ్మకం కలిగి దఫదఫాలుగా రూ.12.13 లక్షలు ఇచ్చారు. డీఎస్సీ పూర్తయినప్పటికీ ఉపాధ్యాయ ఉద్యోగం రాకపోవడంతో బాధితులు రోలుగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలతో నిందితుడు యరగొర్ల శ్రీనును పట్టుకొని అరెస్టు చేశారు.