తూకంలో మోసాలు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:43 AM
తూనికలు, కొలతల శాఖ అధికారి డి.అనురాధ మంగళవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని పలు మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. చికెన్ షాపుల్లో ఎలక్ర్టానిక్ తూనిక యంత్రాల్లో భారీ తేడాలు వుండడంతో పది దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
కిలోకు 110 గ్రాములు తక్కువ వస్తున్నట్టు గుర్తించిన అధికారులు
కృష్ణాదేవిపేటలో పది దుకాణాలపై కేసులు నమోదు
కృష్ణాదేవిపేట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తూనికలు, కొలతల శాఖ అధికారి డి.అనురాధ మంగళవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని పలు మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. చికెన్ షాపుల్లో ఎలక్ర్టానిక్ తూనిక యంత్రాల్లో భారీ తేడాలు వుండడంతో పది దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృష్ణాదేవిపేటలో పలువురు వ్యాపారులు ఎలక్ర్టానిక్ కాటాలతో తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. దీంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని, పలు దుకాణాల్లో కిలోకు 110 గ్రామాలు తేడా వున్నట్టు గుర్తించామని చెప్పారు. తమ వెంట తెచ్చిన ఐదు కిలోల తూకం రాయిని, వ్యాపారుల ఎలక్ర్టానిక్ కాటాల్లో వుంచి పరిశీలించగా, 5.520 కిలోల తూకం కనిపించిందని తెలిపారు. మొత్తం పది మంది వ్యాపారులపై కేసు నమోదు చేశామన్నారు. ఇక నుంచి వ్యాపార సంస్థల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి, తూనికలు-కొలతల్లో మోసాలను అరికడతామని ఆమె చెప్పారు. కొనుగోలు చేసే వస్తువుల తూకం లేదా కొలతల్లో తేడాలు వున్నట్టు గుర్తిస్తే..93981 32730 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.