సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట మోసం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:41 AM
అర్హులైన పేద వర్గాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు కల్పించేందుకు ఎంవీపీ కాలనీలోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్ యాజమాన్యం నిరాకరించింది.
140 మంది వద్ద రూ.2 కోట్లు వసూలు చేసిన ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు
జీతాలు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు
గతంలో విజయవాడలోనూ ఇదే తరహా మోసం
మద్దిలపాలెం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం వారంతా రూ.లక్షలు కట్టారు. నెలల తరబడి పనిచేసినా కంపెనీ నిర్వాహకుడు జీతం ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విన్నకోట సాయికృష్ణ అనే వ్యక్తి ఏడాది కిందట రామ్‌నగర్ కేర్ ఆస్పత్రి పక్క భవనంలో ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కంపెనీ ప్రారంభించాడు. ఉద్యోగంలో చేర్చుకోవడానికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున సుమారు 140 మంది నుంచి రూ.2 కోట్లకుపైగా వసూలుచేశాడు. ఉద్యోగులకు మొదటి నెల మాత్రమే జీతం ఇచ్చాడు. ఆ తరువాత జీతాలు లేవు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు వద్దు తమ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ప్రాజెక్టులు వస్తాయని, ఇతర సంస్థల్లో ప్లేస్‌మెంట్ ఇప్పిస్తానని నమ్మబలుకుతూ వచ్చాడు. ఇలా కాలం గడుపుతుండడంతో బాధితులంతా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు ఉన్నతి టెక్నాలజీస్ డైరెక్టర్ సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చారు. అందరికీ సెటిల్ చేస్తానని చెప్పబోగా...బాధితులు కేసు నమోదుచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా విన్నకోట సాయికృష్ణ, విన్నకోట సురేష్ అనేవారు 2015లో విజయవాడ గాంధీనగర్‌లో ఉన్నతి టెక్నాలజీ సంస్థను ప్రారంభించి ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సాయికృష్ణ, వెలగ సింహాద్రినాయుడులు కలిసి 2025 ఏప్రిల్‌లో పాయకరావుపేట దుర్గానగర్‌లో లాట్ ఆఫ్ హ్యాపీ స్మైల్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థలో కూడా ఉద్యోగాల పేరుతో మోసం జరుగుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
100 ఏసీ బస్సులు అవసరం
భోగాపురం ఎయిర్‌పోర్టుకు 50...
ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదన
విశాఖపట్నం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
నగర ప్రయాణికుల కోసం 100 ఏసీ బస్సులు అవసరమని ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదించారు. ఇందులో 50 బస్సులను భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల కొనుగోలుకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వం యత్నించింది. అయితే ఆ ప్రక్రియ ఆలస్యమయ్యేలా ఉండడంతో ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. జూన్ లేదా జూలైలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే సమయానికి బస్సులు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. మలివిడతలో వచ్చే 50 బస్సులను నగరంలో నడపనున్నారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచేందుకు నిర్మిస్తున్న ఏడు మాస్టర్‌ప్లాన్ రోడ్లను కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇవికాకుండా మరో పది రోడ్లు కొత్తగా అభివృద్ధి చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. వీఎంఆర్‌డీఎ, జీవీఎంసీకి ఈ బాధ్యత అప్పగించనున్నది.
లిటిల్ ఏంజిల్స్‌కు విద్యా శాఖ నోటీస్
పేదలకు ఉచితంగా సీట్లు ఇచ్చేందుకు నిరాకరించిన యాజమాన్యం
తక్షణం వివరణ ఇవ్వాలని ఆదేశించిన అధికారులు
విశాఖపట్నం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
అర్హులైన పేద వర్గాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు కల్పించేందుకు ఎంవీపీ కాలనీలోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. ఈ విషయమై పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా విచారణ జరిపినా విద్యా శాఖ...స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీచేసింది. తక్షణమే వివరణ ఇవ్వాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వచ్చే విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో గల 650 ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఎనిమిది వేల దరఖాస్తులు అందగా, తొలి విడతలో 4,886 మందికి సీట్లు కేటాయించారు. వారిలో 3,500 మంది ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. లిటిల్ ఏంజిల్స్ స్కూలులో సుమారు 40 మందికి సీట్లు కేటాయించారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సిక్స్ స్టెప్ వాలిడేషన్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. దీని ప్రకారం సీటు వచ్చిన విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.2 లక్షలకు మించకూడదు. ఆ మేరకు తల్లిదండ్రులు సంబంధిత తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువపత్రం తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. కానీ లిటిల్ ఏంజిల్స్ స్కూలు యాజమాన్యం తండ్రితోపాటు తల్లి వృత్తి, ఆదాయ వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించింది. తల్లి గృహిణి అని చెప్పినా ఆమె ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. ఇలా ఆరుగురికి సీట్లు ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులు నేరుగా తూర్పు, దక్షిణ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సమస్యను డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖాధికారులు విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు లిటిల్ ఏంజిల్స్ స్కూలుకు షోకాజ్ నోటీస్ ఇచ్చామని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇంకా పాఠశాలకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్నందున సదరు బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు.