Share News

విదేశీ ఉద్యోగాల పేరిట మోసం

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:54 AM

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకొని మోసం చేసిన ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముసునూరి సౌజన్య(43)ను నగరంలోని ద్వారకా స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

విదేశీ ఉద్యోగాల పేరిట మోసం

‘ఫ్లయింగ్‌ బోర్డర్స్‌’ ఎండీ ముసునూరి సౌజన్య అరెస్టు

ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు

ఫేక్‌ ఇంటర్వ్యూలు నిర్వహణ

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

విశాఖపట్నం/సీతంపేట, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకొని మోసం చేసిన ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముసునూరి సౌజన్య(43)ను నగరంలోని ద్వారకా స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సౌజన్య రెండున్నరేళ్ల క్రితం ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ కన్సల్టెన్సీని భర్తతో కలిసి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నాల్లో ప్రారంభించింది. తనకు విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉందని, నెదర్లాండ్స్‌, ఫిన్‌ల్యాండ్‌, తదితర దేశాల్లో కంపెనీలతో టైఅప్‌ ఉందని నమ్మించింది. ఆయా కంపెనీలకు అవసరమైన స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ సిబ్బందిని తన ద్వారా రిక్రూట్‌ చేసుకుంటారని ప్రచారం చేసింది. ఆయా కంపెనీలే వచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటాయని, కొంత కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉంటే మిగిలినదంతా తాను చూసుకుంటానని నమ్మించింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రాసెసింగ్‌ ఫీజుగా వసూలుచేసింది. తన కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్ల ద్వారా ప్రచారం చేయించుకుంది. డబ్బులు చెల్లించి పలు టీవీ షోలను కూడా నిర్వహించింది. ఇదంతా నిజమేనని నమ్మి రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఆ ఆఫీసులకు వెళ్లడం ప్రారంభించారు. ఒక్క విశాఖపట్నం కార్యాలయంలోనే సుమారు 700 మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. వారు చెప్పిన కంపెనీలు ఇంటర్వ్యూలలో ఎవరినీ ఎంపిక చేయకపోవడం, తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో కొందరికి అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేశారు. ఆ ఇంటర్వ్యూలు కూడా బోగస్‌ అని తేలింది. దాంతో హైదరాబాద్‌లో ఫిర్యాదులపర్వం మొదలైంది. ఆ తరువాత విజయవాడకు పాకింది. అక్కడి నుంచి విశాఖపట్నం వరకు సమాచారం వచ్చింది. దాంతో ఉద్యోగార్ధులు మోసపోయామని గుర్తించి విశాఖపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల ఇలాంటి కేసుల్లో విజయవాడ పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చింది. విశాఖపట్నంలోని ద్వారకా స్టేషన్‌ పోలీసులు ఆమె పెనమలూరులో ఉన్నట్టు తెలుసుకుని సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లి గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించి ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. పోలీసులు పట్టుకొని విశాఖపట్నం తీసుకువచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, వారితో చేసుకున్న ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు చెల్లింపులు చేసిన విధానం అన్నీ పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందులో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా?...అని కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిలో కొందరే ఫిర్యాదు చేశారని మోసపోయినవారు చెబుతున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:54 AM