వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:55 AM
వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
ఉమ్మలాడ వద్ద శారదా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృత్యువాత
చిన్నయ్యపాలెం వద్ద వ్యాన్ ఢీకొని రైతు మృతి
తామవరం వద్ద లారీ ఢీకొని యువకుడు..
జిల్లాలో వివిధచోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతుకాగా, మిగిలిన ముగ్గురు యువకులు. మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద శారదా నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద హైవే సర్వీసు రోడ్డులో వ్యాన్ ఢీకొని రైతు మృతిచెందారు. మాకవరపాలెం తామవరం వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒక యువకుడు ప్రాణాలో కోల్పోయాడు.
మునగపాక, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉమ్మలాడ వద్ద శారదా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ ముదిరాజ్ కాలనీ, సాయినగర్‌కు చెందిన చింతా రోహిణికుమార్ (26), తాడి హర్షవర్దన్ (24) స్నేహితులు. రోహిణి కుమార్ డిజిటల్ సెంటర్‌లో, హర్షవర్దన్ సెల్‌పాయింట్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శారదా నదిలో సరదాగా ఈత నేర్చుకుందామని మునగపాక మండలం ఉమ్మలాడ వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నీటిలో దిగారు. అక్కడ ఎక్కువ లోతు వున్న విషయం తెలియక ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. కొంచెం దూరంలో వున్న వారు గమనించి, సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, గజఈతగాళ్లను రప్పించి, మృతదేహాలను బయటకు తీయించారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
వ్యాన్ ఢీకొని రైతు మృతి
సబ్బవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక రైతు మృతిచెందాడు. సీఐ రామచంద్రరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. గొటివాడ గ్రామానికి చెందిన గల్లా సూరిబాబు (49) అనే రైతు ఆదివారం ఉదయం బైక్‌పై కూరగాయలు పెట్టుకొని చిన్నయ్యపాలెం వద్ద జాతీయ రహదారి పక్కనున్న సంతకు బయలుదేరాడు. ఇతను సర్వీసు రోడ్డులో ప్రయాణిస్తుండగా చిన్నయ్యపాలెం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొన్నది. దీంతో సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని ఢీకొన్న వ్యాన్‌లోనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సుమారు రెండు గంటల తరువాత మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సూరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య సత్యవాణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సూరిబాబు టీడీపీ సీనియర్ కార్యకర్త. ఇతని మృతిపట్ల పెందుర్తి ఇన్‌చార్జి గండి బాబ్జీ, ఇతర నాయకులు సంతాపం వ్యక్తం చేశారు
బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడి మృతి
మాకవరపాలెం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తామవరం గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ దామోదరనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ సాయిలోకేశ్ (25)కు మాకవరపాలెంలో స్నేహితులు వున్నారు. వీరిని కలిసేందుకు శనివారం అర్ధరాత్రి సొంతూరు నుంచి బైక్‌పై బయలుదేరాడు. సుమారు రెండు గంటల ప్రాంతంలో తామవరం గ్రామం వద్ద ఎదురుగా నర్సీపట్నం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొన్నది. దీఒంతో సాయిలోకేశ్ త్రీవంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.