Share News

జీవీఎంసీలోకి 4 మండలాలు?

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:10 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

జీవీఎంసీలోకి 4 మండలాలు?

ప్రతిపాదనలు సిద్ధం

పంచాయతీల వారీగా తీర్మానాలు చేసి పంపాలని పైనుంచి ఆదేశాలు

ప్రజాభిప్రాయం తీసుకుంటారా?, లేదా?...అనే అంశంపై స్పష్టత కరవు

విలీనం అంశం తేలిన తరువాతే జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం

విశాఖపట్నం/పద్మనాభం/ఆనందపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని నాలుగు మండలాలను విలీనం చేసిన తరువాత జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విలీనానికి సమ్మతి తెలుపుతూ జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి సోమవారం ఆయా పంచాయతీల ప్రత్యేకాధికారులకు ఆదేశాలు అందాయి. పంచాయతీలు ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నందున విలీన తీర్మానానికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు. మొత్తం 79 పంచాయతీల ప్రత్యేకాధికారుల నుంచి వచ్చిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపనున్నారు. అయితే జీవీఎంసీలో విలీనంపై ప్రజాభిప్రాయం తీసుకుంటారా?, లేదా?...అనే విషయం పంచాయతీ ప్రత్యేకాధికారులు స్పష్టంగా చెప్పడం లేదు.

పెందుర్తి మండలంలోని కొన్ని పంచాయతీలను, భీమిలి మునిసిపాలిటీని, ఆ మండలంలోని పలు పంచాయతీలను 2007లో విశాఖ నగర పాలక సంస్థలో విలీనం చేశారు. ప్రస్తుతం భీమిలి మండలంలో 16, పెందుర్తి మండలంలో 15, ఆనందపురం మండలంలో 26, పద్మనాభం మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాలుగు గ్రామీణ మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,86,870 మంది ఉన్నారు.

గ్రామీణ మండలాల విలీనానికి పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, గంటా శ్రీనివాసరావులు గత ఏడాదే సుముఖత వ్యక్తంచేసినా ఎందుకనో అడుగు ముందుకుపడలేదు. పెందుర్తి మండలంలో మొత్తం పంచాయతీలు, భీమిలి, ఆనందపురంలో కొన్ని పంచాయతీలు జీవీఎంసీని ఆనుకుని ఉన్నాయి. భీమిలి మండలంలో దాకమర్రి, పెదనాగమయ్యపాలెం వంటి పంచాయతీలు, ఆనందపురం మండలంలో కుసులవాడ, భీమన్నదొరపాలెం, బోనీ పంచాయతీలు, పద్మనాభం మండలంలోని పంచాయతీలు నగరానికి దూరంగా ఉన్నాయి. పద్మనాభం మండలంలో కొన్ని పంచాయతీలు విజయనగరానికి దగ్గరగా ఉన్నందున, అక్కడ ప్రజలు అభిప్రాయం ఏమిటనేది త్వరలో తేలనున్నది.

ఉమ్మడి జిల్లాలో 39 మండలాలు ఉండేవి. ఆ ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలతో జడ్పీ పాలకవర్గం గడువు ముగియనున్నది. దీంతో కొత్త జిల్లాల వారీగా జడ్పీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నాలుగు మండలాలతో విశాఖ జిల్లా పరిషత్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. అదేవిధంగా జిల్లాలో 79 గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఏర్పాట్లుచేశారు. జూన్‌ 15న ఓటర్ల జాబితాలు ప్రకటించారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే పూర్తి కావడంతో మంగళవారం ముసాయిదా జాబితా విడుదల చేస్తున్నారు. వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తిచేశారు.


సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు

ఒకే సమస్యపై వరుస పిర్యాదులు రాకూడదు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

పెందుర్తి జోనల్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో అర్జీల స్వీకరణ

ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల పనితీరుపై అసంతృప్తి

వేపగుంట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు. వేపగుంటలోని పెందుర్తి జోనల్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఒకే సమస్యపై తరచూ ఫిర్యాదులు వస్తున్నట్టయితే సంబంధిత అధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం పనితీరుపై అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో తిరిగి ప్రారంభ దశలోనే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఇంజనీరింగ్‌ విభాగం పనితీరుపైనా కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మందకొడిగా సాగడానికి గల కారణాలేమిటని ప్రశ్నించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత జెడ్సీదేనన్నారు. కార్యాలయంలో రెవెన్యూ, పీజీఆర్‌ఎస్‌ నమోదు, యూసీడీ విభాగాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు.

Updated Date - Aug 25 , 2026 | 01:10 AM