రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ABN , Publish Date - May 15 , 2026 | 01:00 AM
ఎలమంచిలి - గాజువాక ప్రధాన రహదారిలోని జల్లెలపాలెం మరిడిమాంబ ఆలయ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
ఒకరి పరిస్థితి విషమం
పరవాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి - గాజువాక ప్రధాన రహదారిలోని జల్లెలపాలెం మరిడిమాంబ ఆలయ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండలం నాగవరం గ్రామం నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులతో స్టీరింగ్ ఆటో దువ్వాడకు బయలుదేరింది. సరిగ్గా ఆటో జల్లెలపాలెం మరిడిమాంబ ఆలయం సమీపానికి వచ్చేసరికి అదే రహదారిలో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న మూలస్వయంభూవరం గ్రామానికి చెందిన బొండా గణేశ్‌కుమార్ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గణేశ్‌కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆటో డ్రైవర్ శీరా వసంతకుమార్‌కు ఎడమ చేయి విరిగిపోగా, ఆటో ఉన్న విద్యార్థులు అవినాష్, బాలాజీకుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో గణేశ్‌కుమార్‌ను విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం ధ్వంసమైంది. ద్విచక్ర వాహనదారుడు తన ముందున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.