ఉత్తమ గురువులు నలుగురు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:59 AM
గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా నుంచి నలుగురిని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక
5న గురుపూజోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం
ఆనందపురం/గోపాలపట్నం/గాజువాక/జ్ఞానాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా నుంచి నలుగురిని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అవార్డుకు ఎంపికైన వారిలో జ్ఞానాపురం సెక్రాడ్ హార్ట్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా పనిచేస్తున్న పి.నిర్మలాకుమారి, బోయపాలెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా పనిచేస్తున్న పీవీ సాయికుమారి, నడుపూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్)గా పనిచేస్తున్న ఎంవీఎస్‌ఎస్‌ఎస్‌ఎన్‌సీకే రాజ్‌కుమార్, గోపాలపట్నం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎన్‌ఎస్‌వీఎస్‌ఎస్ పూర్ణచంద్రరావు ఉన్నారు. వీరంతా ఈనెల ఐదో తేదీన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకుంటారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన
ఆనందపురం మండలం బోయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్న ఊడిపెద్ది విజయసాయికుమారి 26 ఏళ్ల కిందట ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆమె పాఠ్యాంశాలను బోధిస్తుంటారు. 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న ఆమె తాజాగా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
మండల, జిల్లా స్థాయిలో పలు అవార్డులు
పాతగోపాలపట్నం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నూకల పూర్ణచంద్రరావు 1998లో వృత్తిలోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో పదేళ్లు, కృష్ణా జిల్లా బావులపాడు మండలంలో ఎనిమిదేళ్లు, పనిచేసిన ఆయన అంతర్ జిల్లా బదిలీల్లో విశాఖ జిల్లాకు వచ్చిన తరువాత సబ్బవరం, గోపాలపట్నం మండలాల్లో పనిచేశారు. గతంలో నాలుగుసార్లు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఒకసారి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.
మూడు దశాబ్దాల కిందట ఉపాధ్యాయ వృత్తిలోకి...
మూడు దశాబ్దాల కిందట ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన జ్ఞానాపురం సెక్రడ్ హార్ట్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పొలమరశెట్టి నిర్మలభారతి 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. 2017లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించడంలో గుర్తింపు పొందారు. తాజాగా రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రయోగాత్మకం, వినూత్నం...
నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంవీఎస్‌ఎస్‌ఎన్‌కే రాజ్‌కుమార్ మూడు దశాబ్దాలుగా విద్యార్థులకు ప్రయోగాత్మకంగా, నూతన విద్యావిధానంలో బోధిస్తూ గుర్తింపుతెచ్చుకున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లలో పలు అవార్డులు సాధించారు. రాష్ట్రస్థాయిలో పరీక్ష పత్రాల రూపకల్పన, టెక్స్ట్ట్‌బుక్స్, మాడ్యూల్స్ రచయితగా, కవిగా, నటుడిగా ప్రతిభ చూపారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశం
మెట్రో ప్రాజెక్టుకు భూ సేకరణను వేగవంతం చేయాలి
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
దీర్ఘకాలిక, క్లిష్టమైన సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. భీమిలి, విశాఖ రెవెన్యూ డివిజన్లకు చెందిన సదస్సు గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 22-ఎ కేసులు, డీనోటిఫికేషన్, ఆక్రమణల క్రమబద్ధీకరణపై వేగం పెంచాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని, చెరువులు, వాగుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు పరిహారం అందించాలన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ఆన్‌లైన్ సేవలు విస్తృతం చేయాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాదరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్‌చక్రవర్తి, సంగీత్‌మాథుర్, డిప్యూటీ కలెక్టర్లు గోవిందు, అనిత, మాధవీలత, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, తహశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య
మనస్పర్థలే కారణం
మల్కాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
ఓ నౌకాదళ ఉద్యోగి భార్య గురువారం ఉదయం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. నేవీలో సెయిలర్‌గా పనిచేస్తున్న దీపక్‌వర్మ భార్య ప్రియాంకవర్మ (22), కుమార్తె (మూడేళ్లు), కుమారుడు (13 నెలలు)తో నగరంలోని నౌసేనాబాగ్‌లో గల కావేరి బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం...గురువారం ఉదయం టిఫిన్ చేయాలని భర్తను ప్రియాంక కోరగా, అతను తిననని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం దీపక్‌వర్మ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో క్షణికావేశంలో ప్రియాంకవర్మ పక్కనే ఉన్న గోమాత బిల్డింగ్ (పదిహేను అంతస్థులు) పైకి వెళ్లి కిందకు దూకేసింది. అయితే ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో విచారణలో తేలాల్సి ఉంది. అలాగే ప్రియాంక తమ భవనంపైకి కాకుండా పక్క భవనం పైకి వెళ్లడానికి గల కారణాలేమిటో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రియాంక సొంత రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్. అక్కడ నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక మరిన్ని విషయాలు తెలియవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని ఐఎన్‌ఎస్ కల్యాణి ఆస్పత్రికి తరలించారు. మల్కాపురం సీఐ నరసింహరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ అప్పలనాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మసాజ్ సెంటర్‌లు, స్పాలలో తనిఖీలు
ఏకకాలంలో 150 చోట్ల సోదాలు
అనేక ఉల్లంఘనల గుర్తింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కొన్ని మసాజ్ సెంటర్‌లు, స్పాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఫిర్యాదులు నేపథ్యంలో తనిఖీలు చేపట్టాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఏకకాలంలో 150కిపైగా స్పాలు, మసాజ్ సెంటర్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కొన్ని మసాజ్ సెంటర్లలో సీసీ కెమెరాలు లేకపోవడం, మరికొన్నిచోట్ల రికార్డులు నిర్వహించకపోవడం, మరికొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా అంతర్గతంగా గదులు ఏర్పాటుచేయడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్టు తెలిసింది. అలాగే గాజువాకలోని ఒక మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి పశ్చిమ బెంగాల్, థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరేసి మహిళలను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి పంపించారు. నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది.