Share News

అరకులోయలో బ్లడ్‌బ్యాంకుకు శంకుస్థాపన

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:09 PM

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సొంత నిధులతో అరకులోయలో నిర్మించనున్న బ్లడ్‌బ్యాంకుకు శుక్రవారం ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, ఎమ్మెల్యే మత్స్యలింగం, కలెక్టర్‌ నిషాంతి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి చిరంజీవి శంకుస్థాపన చేశారు.

అరకులోయలో బ్లడ్‌బ్యాంకుకు శంకుస్థాపన
బ్లడ్‌బ్యాంకు భవణ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, కలెక్టర్‌ నిషాంతి, ఎమ్మెల్యే మత్స్యలింగం, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి చిరంజీవి

పాల్గొన్న కలెక్టర్‌, ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే

పవన్‌కల్యాణ్‌ సొంత నిధులతో భవన నిర్మాణం

బీఎస్‌ఆర్‌ ట్రస్టుకు నిర్మాణ బాధ్యతలు అప్పగింత

అరకులోయ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సొంత నిధులతో అరకులోయలో నిర్మించనున్న బ్లడ్‌బ్యాంకుకు శుక్రవారం ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, ఎమ్మెల్యే మత్స్యలింగం, కలెక్టర్‌ నిషాంతి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి చిరంజీవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నిషాంతి మాట్లాడుతూ ఏజెన్సీలో బ్లడ్‌బ్యాంకు అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్నవారికి ఈ బ్లడ్‌బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన సొంత నిధులు రూ. కోటి మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ భవన నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బీఎస్‌ఆర్‌ చారిటిబుల్‌ ట్రస్ట్‌కు అప్పగించడం మంచి పరిణామం అని అన్నారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర మాట్లాడుతూ డుంబ్రిగుడ మండల పర్యటనకు పవన్‌కల్యాణ్‌ వచ్చినప్పుడు 30 మంది సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్నవారు ఉన్నారని వివరించినట్టు చెప్పారు. దీంతో బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణానికి పవన్‌కల్యాణ్‌ కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే మత్సలింగం మాట్లాడుతూ అరకులోయలో బ్లడ్‌బ్యాంకు అవసరాన్ని గుర్తించి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన సొంత నిధులు మంజూరు చేయడం శుభపరిణామమన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌కు గిరిజనులంటే ఎంతో ఇష్టమన్నారు. అందువల్లే ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు రహదారులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారన్నారు. బీజేపీ ప్రతినిధి దాస్‌ మాట్లాడుతూ బ్లడ్‌బ్యాంకు ఏర్పాటైతే గిరిజన ప్రాంతంలో ఉండే ఆరోగ్యవంతులందరూ బ్లడ్‌ను దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ డాక్టర్‌ నీలవేణిదేవి, బీఎస్‌ఆర్‌ చారిటిబుల్‌ ట్రస్టు ప్రతినిధులు, సైట్‌ ఇంజనీర్‌ ప్రవీణ్‌, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రాము, ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 11:09 PM