Share News

వచ్చే నెలలో మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమకు శంకుస్థాపన?

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:44 AM

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ (ఏఎం-ఎన్‌ఎస్‌ఐ) ఏర్పాటుకు కావలసినవనరులను ప్రభుత్వ యంత్రాంగం సమకూరుస్తోంది. ఈ పరిశ్రమకు నవంబరు 14న శంకుస్థాపన చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదాపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...ఫిబ్రవరి నెలలో సీఎం చంద్రబాబునాయుడు స్టీల్‌ పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది.

వచ్చే నెలలో మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమకు శంకుస్థాపన?
నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకుల నిర్మాణం

నిర్మాణం కోసం ఏలేరు కాలువ నుంచి నీరు

నక్కపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ పరిశ్రమ (ఏఎం-ఎన్‌ఎస్‌ఐ) ఏర్పాటుకు కావలసినవనరులను ప్రభుత్వ యంత్రాంగం సమకూరుస్తోంది. ఈ పరిశ్రమకు నవంబరు 14న శంకుస్థాపన చేయాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదాపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...ఫిబ్రవరి నెలలో సీఎం చంద్రబాబునాయుడు స్టీల్‌ పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఫిబ్రవరి 14 వరకూ మూఢం ఉండడంతో, 15న లేదా ఆ తరువాత రోజుల్లో శంకుస్థాపన చేయవచ్చునని అధికార యంత్రాంగం భావిస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు సంయుక్తంగా రూ.1,47,162 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి దశ (7.3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం) 2029 నాటికి, రెండో దశ (10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి) 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్టీల్‌ప్లాంటు కోసం ప్రభుత్వం 2,164.31 ఎకరాలు కేటాయించింది.

ఏలేరు నుంచి స్టీల్‌ప్లాంటుకు నీటి సరఫరా

ఉక్కు కర్మాగారానికి నాతవరం మండలం ఎంబీ పట్నం వద్ద గల ఏలేరు ప్రధాన కాలువ (ఏఎంసీ) నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించి భారీ పైపులైన్లు వేస్తున్నారు. నాతవరం నుంచి నక్కపల్లి వరకూ సుమారు 53 కిలోమీటర్ల పొడవున ఈ పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీఐఐసీ జడ్‌ఎం ఎస్‌.నరసింహరావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. నీటి నిల్వ కోసం ట్యాంకులు నిర్మిస్తున్నారు. మరోవైపు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చురుగ్గా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు సాగుతున్నాయి.

శంకుస్థాపన నాటికి అన్నీ సిద్ధం చేస్తాం

నరసింహరావు, ఏపీఐఐసీ జడ్‌ఎం

దేశం గర్వించదగ్గ స్టీల్‌ పరిశ్రమ శంకుస్థాపనకు ప్రభుత్వ ఆదేశాలతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఏలేరు మెయిన్‌ కెనాల్‌ నుంచే స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి అవసరమైన నీటిని సమకూర్చుతాం. త్వరలోనే స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 12:44 AM