Share News

ఏయూను సందర్శించిన మాజీ రాష్ట్రపతి కోవింద్‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:44 AM

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

ఏయూను సందర్శించిన మాజీ రాష్ట్రపతి కోవింద్‌

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఏయూ పరిపాలనా భవనం వద్ద ఆయనకు వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి మాజీ రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొఫెసర్‌ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి మాజీ రాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పరిపాలనా భవనం వద్ద మొక్క నాటారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ పులిపాటి కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్‌, పాలక మండలి సభ్యులు, డీన్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎండోమెంట్‌ లెక్చర్‌లో పాల్గొన్నారు.


17, 18 తేదీల్లో వీఎంఆర్‌డీఏ ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 17, 18 తేదీల్లో మేళా నిర్వహిస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించినప్పుడు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరే పనులు పూర్తిచేసుకున్నారు. ఇంకా కొన్ని పత్రాలు సమర్పించాల్సిన వారు 2,500 మంది, ఫీజులు చెల్లించాల్సినవారు 600 మంది వరకు ఉన్నారు. వీరంతా ఈ నెల 17, 18 తేదీల్లో సంబంధిత పత్రాల (రశీదులు, ఈసీలు, హక్కు పత్రాలు)తో సిరిపురం జంక్షన్‌లో గల కార్యాలయానికి వచ్చినట్టయితే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్‌ తెలిపారు.


ఆర్బీఐ అధికారులమంటూ టోకరా

రిటైర్డు ఉద్యోగి నుంచి రూ.1.94 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ఇద్దరి అరెస్టు

ఎండాడ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన రిటైర్డు ఉద్యోగికి ఆర్బీఐ అఽధికారులమంటూ పరిచయమై డిజిటల్‌ అరెస్టు పేరుతో మోసం చేసిన కేసులో సైబర్‌ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆర్బీఐ అధికారులమంటూ రిటైర్డు ఉద్యోగి నుంచి నిందితులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య దఫదఫాలుగా రూ.1.94 కోట్లు కొల్లగొట్టారు. దీనిపై బాధితుడు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. నగరానికి చెందిన చుక్కా రాజేష్‌ (ఏ1), తేజ్‌కుమార్‌ (ఏ 2), చెన్నా ప్రసాద్‌ (ఏ 3), ఆకుల మహేంద్ర (ఏ4), సిద్ధిరెడ్డి శివప్రసాద్‌ (ఏ5) నిందితులుగా గుర్తించారు. చుక్కా రాజేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. శనివారం ఆకుల మహేంద్ర, చెన్నా ప్రసాద్‌లను రుషికొండ కూడలిలో అరెస్టు చేసినట్టు సైబర్‌ పోలీసులు తెలిపారు. చెన్నా ప్రసాద్‌ భార్య ఖాతాల ద్వారా రూ.33 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారని సమాచారం. ఇదిలావుండగా ఉద్యోగాల పేరుతో యువకులను కాంబోడియా, తదితర దేశాలకు పంపించారనే అభియోగాలు కూడా చుక్కా రాజేశ్‌, తదితరులపై ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:44 AM