మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ భూ ఆక్రమణ
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:12 AM
చోడవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణ ధర్మశ్రీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు శుక్రవారం రాంబిల్లి తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు.
మూలజంపలో 1.33 ఎకరాలు కబ్జా చేసినట్టు కూటమి నేతల ఆరోపణ
రాంబిల్లి తహశీల్దారుకు ఫిర్యాదు
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్
రాంబిల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): చోడవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణ ధర్మశ్రీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు శుక్రవారం రాంబిల్లి తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ, రాంబిల్లి మండలం మూలజంప రెవెన్యూ పరిధిలోని 140-1 సర్వే నంబరులో గేదెల లక్ష్మి అనే మహిళ నుంచి 21-10-2020న ధర్మశ్రీ (అప్పట్లో ఆయన ఎమ్మెల్యే, వైసీపీ అధికారంలో వుంది) తన కుమారుడి పేరున కొనుగోలు చేశారన్నారు. వాస్తవంగా అక్కడ ఉన్నది 2.82 ఎకరాలు మాత్రమేనని, అయితే ఎమ్మెల్యే హోదాను అడ్డుపెట్టుకొని ఈ భూమికి ఆనుకొని ఉన్న 50 సెంట్ల కొండ పోరంబోకు, 33 సెంట్ల కాలువ, 50 సెంట్లు గయాలు కలిపి మొత్తం 1.33 ఎకరాల ప్రభుత్వ భూమిని ధర్మశ్రీ ఆక్రమించారని ఆరోపించారు. మొత్తం మీద 4.1 ఎకరాలను 17-1-2023న కుమారుడి నుంచి కుమార్తెరకు గిఫ్ట్ డాక్యుమెంట్ ద్వారా బదిలీ చేశారని తెలిపారు. అంతే కాకుండా తరువాత నిర్వహించిన భూముల రీసర్వే సమయంలో 140-1 సర్వే నంబరులో 2.82 ఎకరాలకు బదులు 4.1 ఎకరాలుగా రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవిని అడ్డంపెట్టుకొని అధికారులను బెదిరించి ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరమని అన్నారు. కరణం ధర్మశ్రీ భూ ఆక్రమణలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. తహశీల్దారకు ఫిర్యాదు చేసిన వారిలో కూటమి నేతలు వి.దిన్‌బాబు, పప్పల నూకన్నదొర, బైలపూడి శ్రీరామదాసు, కొరుప్రోలు చిన్నారావు, జనపరెడ్డి శ్రీనివాసరావు, కశిరెడ్డి నరిసింగరావు, సేనాపతి సన్యాసిరావు, పొట్నూరి శివశంకర్, మోటూరి శ్రీవేణి, తదితరులు వున్నారు.